Telugu Global
National

షిండే-ఫడ్నవీస్ కాపురం మూణ్ణాళ్ల ముచ్చటేనా..?

ఫడ్నవీస్ పెత్తనం ఎక్కువైపోయిందనేది షిండే వర్గం మంత్రుల ప్రధాన ఆరోపణ. అధికారులంతా తమ ఆదేశాలు పాటించకుండా ఫడ్నవీస్ ఆజ్ఞల కోసం ఎదురు చూస్తున్నారని సీఎం ఏక్ నాథ్ షిండే వద్ద మొరపెట్టుకుంటున్నారు శివసేన చీలిక మంత్రులు.

షిండే-ఫడ్నవీస్ కాపురం మూణ్ణాళ్ల ముచ్చటేనా..?
X

మహారాష్ట్రలో శివసేనను చీల్చి బీజేపీ లాభపడిందని అనుకున్నారంతా. కానీ అంతకు అంత ఆ పార్టీ అనుభవించే రోజు దగ్గర్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు షిండే-ఫడ్నవీస్ మైత్రి ఎక్కువ కాలం నిలబడదని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పెత్తనం ఎక్కువైపోయిందనేది షిండే వర్గం మంత్రుల ప్రధాన ఆరోపణ. అధికారులంతా తమ ఆదేశాలు పాటించకుండా ఫడ్నవీస్ ఆజ్ఞల కోసం ఎదురు చూస్తున్నారని సీఎం ఏక్ నాథ్ షిండే వద్ద మొరపెట్టుకుంటున్నారు శివసేన చీలిక మంత్రులు. గుజరాత్‌లో క్యాంప్ పాలిటిక్స్ నడపడానికి కూడా వారు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

అటు ఫడ్నవీస్ కూడా షిండే కలయికతో పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేరు. షిండేను బయటకు తీసుకొస్తే.. ఎన్సీపీ, కాంగ్రెస్, ఉద్ధవ్ కూటమిలో బీటలు వస్తాయని అంచనా వేశారు ఫడ్నవీస్. షిండే తోకజాడిస్తే.. కూటమి నుంచి బయటకొచ్చేవారితో సర్దుకుపోవచ్చనే అంచనా వేశారు. కానీ అది సఫలం కాలేదు. పైగా కాంగ్రెస్, ఎన్సీపీ, ఉద్ధవ్ మైత్రి మరింత బలపడింది. రాహుల్ భారత్ జోడో యాత్ర వారి బలప్రదర్శనకు వేదిక అయ్యే అవకాశముంది. ఇటు షిండే సీఎంగా ఉండటంతో ఆయనకు చెప్పకుండా ఏ పనీ చేయడానికి లేకుండా పోతోందని ఫడ్నవీస్ బాధపడుతున్నారు.

డబుల్ ఇంజిన్ కాదు.. డబ్బా ఇంజిన్..

కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి పరుగులు పెడుతుందని అనుకున్నా.. ప్రస్తుతం మహారాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారైపోయింది. మహారాష్ట్రకు రావాల్సిన నాలుగు ప్రాజెక్ట్‌లు ఇటీవల గుజరాత్ తన్నుకుపోయింది. వాటి విలువ 1.79 లక్షల కోట్ల రూపాయలు. ఆ మేరకు మహారాష్ట్రకు నష్టం వాటిల్లినా షిండే నోరు మెదపకపోవడం విశేషం. వేదాంత ఫాక్స్ కాన్ చిప్ మేకింగ్ ప్రాజెక్ట్, బల్క్ డ్రగ్-తయారీ ప్రాజెక్ట్, మెడికల్ పార్క్, తాజాగా దూరమైన సైనిక రవాణా విమానాల తయారీ టాటా-ఎయిర్‌ బస్ ప్లాంట్.. ఇలా ప్రాజెక్ట్‌లన్నీ గుజరాత్‌కి తరలిపోవడాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. మహారాష్ట్రను దోచి గుజరాత్‌కి పెట్టడాన్ని వారు ఏమాత్రం సహించబోరని అంటున్నారు ఎన్సీపీ నేతలు.

షిండే వర్గం ఉద్ధవ్‌తో టచ్‌లో ఉందా..?

వాస్తవానికి మహారాష్ట్రలో షిండే వర్గం కొత్తగా దక్కించుకుందేమీ లేదు. గతంలో శివసేన పేరుతో అధికారంలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీతో కలసి కూటమి పేరుతో అధికారంలో ఉన్నారు. కానీ చీలిక నేతలంతా దురాశతో ప్రభుత్వాన్ని కూలదోశారు, బీజేపీతో కలసి ఇప్పుడు అధికారం పంచుకోవాల్సి రావడంతో వారిలో చాలా మంది అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు ఉద్ధవ్‌తో టచ్‌లో ఉన్నారని కూడా అంటున్నారు. ఏ క్షణాన ఏం జరిగినా షిండే వర్గంలోని ఉద్ధవ్ టీమ్ తిరిగి వెనక్కి రావొచ్చు. అంటే అక్కడ ఏక్ నాథ్ ఏకాకి కావాల్సిందేనన్నమాట.

నాయకుల సంగతి ఎలా ఉన్నా.. ప్రభుత్వం మాత్రం అంత సాఫీగా సాగడంలేదు. ఆధిపత్య పోరుతో షిండే, ఫడ్నవీస్ లోలోపల గోతులు తవ్వుకుంటున్నారు. ప్రస్తుతం గుజరాత్‌లో ఎన్నికలు ఉన్నా కూడా, మహారాష్ట్రలో అంతకు మించి పొలిటికల్ హీట్ ఉంది. అటు కేంద్రం కూడా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూలదోయడంపై పెట్టిన శ్రద్ధ, రాష్ట్ర అభివృద్ధిపై చూపించడం లేదు. దీంతో కూటమి మూణ్ణాళ్ల ముచ్చటేనని అంటున్నారు.

First Published:  31 Oct 2022 8:35 AM GMT
Next Story