Telugu Global
National

రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న అమిత్ షా ప్లాన్ ను బీజేపీ నేత వసుంధర రాజే విఫలం చేశారా ?

2020లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు సమయంలో మాజీ సీఎం వసుంధర రాజే, మరో ఇద్దరు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు తమ ప్రభుత్వాన్ని రక్షించడంలో సహాయపడ్డారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదివారం సంచలన విషయాలు బైటపెట్టారు.

రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న అమిత్ షా ప్లాన్ ను బీజేపీ నేత వసుంధర రాజే విఫలం చేశారా ?
X

రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్లాన్ చేశారా ? ఆ ప్లాన్ ను విఫలం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడింది. గుజరాత్ బీజేపీ నాయకులేనా ? ఈ ప్రశ్నలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అవుననే సమాధానం చెప్తున్నారు.

2020లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు సమయంలో మాజీ సీఎం వసుంధర రాజే, మరో ఇద్దరు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు తమ ప్రభుత్వాన్ని రక్షించడంలో సహాయపడ్డారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదివారం సంచలన విషయాలు బైటపెట్టారు.

జూలై 2020లో, రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, మరో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అశోక్ గెహ్లాట్ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. పార్టీ హైకమాండ్ జోక్యంతో నెల రోజులు కొనసాగిన‌ సంక్షోభానికి తెరపడింది. ఆ తర్వాత పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుండి తొలగించారు.

వసుంధర రాజే స్వంత నియోజకవర్గమైన ధోల్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గెహ్లాట్ మాట్లాడుతూ, “ముగ్గురు బీజేపీ నేతలు – మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, మాజీ అసెంబ్లీ స్పీకర్ కైలాష్ మేఘవాల్, ఎమ్మెల్యే శోభారాణి కుష్వా మద్దతు వల్లే నా ప్రభుత్వాన్ని కాపాడగలిగాం” అని అన్నారు.

" కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్ కలిసి నా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పన్నారు. వారు రాజస్థాన్‌లో ఎమ్మెల్యేలకు డబ్బు పంపిణీ చేసారు. వారు ఇప్పుడు డబ్బును తిరిగి తీసుకోవడం లేదు. వారు ఎమ్మెల్యేల‌ నుండి డబ్బును ఎందుకు తిరిగి డిమాండ్ చేయడం లేదని నేను ఆశ్చర్యపోతున్నాను " అని ఆయన పేర్కొన్నారు.

10కోట్లు, 20కోట్లు...ఎంత తీసుకున్నా.. మీరు ఏమైనా ఖర్చు చేసి ఉంటే ఆ భాగం ఇస్తానని, లేదంటే ఏఐసీసీ నుంచి తీసుకుంటానని ఆ డబ్బులను బీజేపీ నాయకులకు తిరిగి ఇచ్చేయండంటూ ఎమ్మెల్యేలకు కూడా చెప్పాను అని గెహ్లాట్ అన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భైరాన్ సింగ్ షెకావత్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రాష్ట్ర పార్టీ చీఫ్‌గా తాను మద్దతు ఇవ్వలేదని, అదే విధంగా, 2020లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రాజే, మేఘ్వాల్ మద్దతు ఇవ్వలేదని గెహ్లాట్ అన్నారు.

కాగా, గెహ్లాట్ వ్యాఖ్యలను వసుంధర రాజే ఖండించారు. తనను గెహ్లాట్ దారుణంగా అవమానించారని రాజే మండిపడ్డారు. ఎమ్మెల్యేలకి అమిత్ షా లంచం ఇచ్చింది నిజమైతే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని ఆమె గెహ్లాట్ కు సవాల్ విసిరారు.

First Published:  8 May 2023 3:13 AM GMT
Next Story