Telugu Global
National

ఆల్కహాల్, సీడీలు, గడియారాలు.. దేవుళ్లకు కానుకలు

మనదేశంలోని కొన్ని ఆలయాల్లో భక్తులు దేవుళ్లకు చాలా ఆశ్చర్యకరమైన నైవేద్యాలను పెడుతున్నారు.

ఆల్కహాల్, సీడీలు, గడియారాలు.. దేవుళ్లకు కానుకలు
X

సాధారణంగా గుళ్లకు వెళ్లిన భక్తులు దేవునికి పూలు, పండ్లు, కొబ్బరికాయలు వంటివి నైవేద్యంగా సమర్పిస్తుంటారు కదా. అయితే మనదేశంలోని కొన్ని ఆలయాల్లో భక్తులు దేవుళ్లకు చాలా ఆశ్చర్యకరమైన నైవేద్యాలను పెడుతున్నారు. అలాగే మనం ఊహించని వస్తువులను దైవానికి కానుకలుగా సమర్పిస్తున్నారు.

ఆ ఆలయాల వివరాలు..

మధ్యప్రదేశ్ లోని కాలభైరవుని ఆలయంలో లిక్కర్ ని ప్రసాదంగా ఇస్తుంటారు. భక్తులు కూడా దేవుడికి ఆల్కహాల్ నే సమర్పిస్తుంటారు. కొద్ది మోతాదులో ఆల్కహాల్ ని దైవ విగ్రహం నోట్లో పోసిన అనంతరం పూజారి పూజలు నిర్వహిస్తారు. మిగిలిన దానిని భక్తులకు ప్రసాదంగా పంచి పెడుతుంటారు. దైవానికి నిర్వహించే ఐదు తాంత్రిక క్రియల్లో ఆల్కహాల్ ని సమర్పించడం కూడా ఒకటి గా భావిస్తారు.

కేరళలోని మంచ్ మురుగన్ ఆలయంలో దేవునికి మంచ్ చాక్లెట్లను భక్తులు నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అందుకే ఈ గుడిని మంచ్ మురుగన్ ఆలయంగా పిలుస్తారు. కేరళలోని చెమ్మత్ శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయం ఇది. ఈ ఆలయంలో మంచ్ ఇచ్చే ఆచారం వెనుక ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. ఒక చిన్న కుర్రాడు తనకు ఆరోగ్యం బాగోని సమయంలో పదేపదే మురుగన్ స్వామి పేరుని తలచాడట. దాంతో అతని తల్లిదండ్రులు బాబుని మురుగన్ గుడికి తీసుకుని వెళ్లారు. అక్కడి అర్చకులు దేవునికి పళ్లు, పూలు నైవేద్యంగా పెట్టమని కోరగా బాలుడు అందుకు ఒప్పుకోకుండా మంచ్ చాక్లెట్ ని దేవుని సమర్పించాడట. ఆశ్చర్యకరంగా బాలుడు కోలుకుని ఆరోగ్యవంతుడయ్యాడట. అప్పటినుండి ఆ గుడికి భక్తులు మంచ్ చాక్లెట్లను నైవేద్యంగా తీసుకుని వెళుతున్నారు. అంతేకాదు.. మంచ్ చాక్లెట్ల‌తో తయారు చేసిన దండలను సైతం భక్తులు దేవునికి సమర్పిస్తుంటారు.

కోల్ కతాలోని కాళీ ఆలయంలో భక్తులు చైనీస్ ఫుడ్ ని నైవేద్యంగా ఇస్తుంటారు. కోల్ కతాలోని చైనా టౌన్ లో నివసించే చైనీయులు ఈ గుడిలో కాళీమాతని పూజిస్తుంటారు. అందుకే వారు మాతకు నూడిల్స్, డిమ్ సమ్, చాప్సీ వంటి చైనా వంటకాలను సమర్పిస్తుంటారు. అంతేకాదు.. ఆ గుడిలో జరిగే పూజలు, కార్యక్రమాల్లో చైనీయుల పద్ధతులు, ఆచారాలను పాటిస్తుంటారు.

కేరళలోని మహాదేవ గుళ్లో భక్తులు సీడీలు, డీవీడీలు, పాఠ్యపుస్తకాలను సమర్పిస్తుంటారు. కేరళలోని నేషనల్ హెరిటేజ్ సెంటర్ క్యాంపస్ లో ఈ గుడి ఉంది. దీని నిర్వహణాధికారులు మహాదేవుడు భక్తులకు జ్ఞానాన్ని, తెలివితేటలను ప్రసాదిస్తారనే నమ్మకంతో ఇలాంటి కానుకలను అనుమతిస్తుంటారు. అందుకే భక్తులు రాత పేపర్లు, పాఠ్యపుస్తకాలు, సీడీలు, డీవీడీల రూపంలో బోలెడంత సమాచారాన్నే దేవునికి కానుకగా సమర్పిస్తుంటారు.

ఉత్తర ప్రదేశ్ లోని బ్రహ్మబాబా గుడిలో భక్తులు దేవుడికి గడియారాలను కానుకగా ఇస్తుంటారు. ఇక్కడికి అనేక ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. ఆ గుళ్లో దైవం తమ కోర్కెలను తీర్చకపోవటం అంటూ ఉండదని భక్తులు అంటారు. చేతివాచ్ లు, గోడ గడియారాలు సమర్పించి మొక్కుతుంటారు. అంతకంటే ఆశ్చర్యమేమిటంటే.. ఈ గుళ్లో పూజారి కానీ, సెక్యురిటీ గార్డుగానీ ఉండరు.

First Published:  18 July 2022 8:54 AM GMT
Next Story