Telugu Global
National

నీ కళ్లముందే 50మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లా.. ఏం చేశావ్..?

పనిలో పనిగా తమ ప్రతాపం ఏంటో ఆల్రడీ మీరు చూశారు కదా అన్నారు. 50మందిని ఎత్తుకెళ్లాం, అప్పుడే ఏం చేయలేని మీరు, ఇప్పుడేం చేస్తారంటూ ప్రశ్నించారు.

నీ కళ్లముందే 50మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లా.. ఏం చేశావ్..?
X

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో షిండే వర్గం తమతో చేతులు కలిపిందని చెప్పుకునేవారు కాషాయ పార్టీ నేతలు. అభివృద్ధికోసమే తాను సీఎం సీటు కూడా త్యాగం చేసి షిండే వర్గంతో కలసి పనిచేస్తున్నానని పదే పదే చెప్పుకునేవారు మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఇప్పుడెందుకు చిర్రెత్తుకొచ్చిందో కానీ ఉన్నట్టుండి ఉన్న విషయం బయటపెట్టారు. షిండే వర్గం తమవైపు ఆకర్షితులు కాలేదని, తామే వారిని ఎత్తుకెళ్లామని కుండబద్దలు కొట్టారు. ఆదిత్య థాక్రేకి వార్నింగి ఇస్తూ ఇలా నోరు జారారు ఫడ్నవీస్. నీ కళ్లముందే 50మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేశాం, అప్పుడేం చేశావ్ అంటూ మాజీ మంత్రి ఆదిత్య థాక్రేని ప్రశ్నించారాయన.

ఎందుకీ సవాళ్లు..?

32 ఏళ్ల వ్యక్తికి ఈ ప్రభుత్వం భయపడుతోందంటూ ఆదిత్య థాక్రే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. థాక్రేలంటే ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ కి ఎక్కడో కాలింది. పిల్ల థాక్రేని చూసి ఎవరూ భయపడబోరని సమాధానమిచ్చారు. "నువ్వే కాదు, నీ తండ్రి ఉద్ధవ్ థాక్రేని చూసినా ఎవరికీ భయం లేదు" అని అన్నారు ఫడ్నవీస్. పనిలో పనిగా తమ ప్రతాపం ఏంటో ఆల్రడీ మీరు చూశారు కదా అన్నారు. 50మందిని ఎత్తుకెళ్లాం, అప్పుడే ఏం చేయలేని మీరు, ఇప్పుడేం చేస్తారంటూ ప్రశ్నించారు. అప్పుడు ముంబై కాలిపోతుందన్నారు. కానీ అగ్గిపుల్ల కూడా మండలేదంటూ సెటైర్లు వేశారు.

మహా రాష్ట్రలో షిండే వర్గం తిరుగుబాటుతో మహా ఘట్ బంధన్ కూలిపోయిన సంగతి తెలిసిందే. 40మందికి పైగా శివసేన చీలిక ఎమ్మెల్యేలు బీజేపీతో చేతులు కలిపి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, సీఎం పోస్ట్ సహా కీలక శాఖలు చేజిక్కించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా.. షిండే వర్గానికి బీజీపీ చుక్కలు చూపెడుతుందనే విషయం వాస్తవం. అందుకే అధికారంలో ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తోంది షిండే వర్గం. అవకాశం వస్తే ఎన్నికల ముందు ఉద్ధవ్ థాక్రే గ్రూపులో చేరేందుకు కూడా కొంతమంది రెడీ అవుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్, థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

First Published:  31 Dec 2022 11:58 AM GMT
Next Story