Telugu Global
National

ఇబ్రహీంకు చెక్.. జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడిగా కుమారస్వామి

దేవెగౌడ, కుమారస్వామి కావాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని.. తాము మాత్రం అందుకు సిద్ధంగా లేమని చెప్పారు. అసలైనా జేడీఎస్ పార్టీ తమదేనన్నారు.

ఇబ్రహీంకు చెక్.. జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడిగా కుమారస్వామి
X

కర్ణాటక జేడీఎస్‌లో నెలకొన్న సంక్షోభాన్ని తుడిసిపెట్టేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ చర్యలు తీసుకున్నారు. సంక్షోభానికి కారణమైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీంను ఆ పదవి నుంచి తొలగించారు. దీంతో ఇబ్రహీంకు దేవెగౌడ చెక్ పెట్టినట్లయ్యింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేయాలని దేవెగౌడ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు బీజేపీ అగ్రనేతలతో దేవెగౌడ చర్చలు కూడా జరిపారు. ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలన్న విషయమై చర్చించారు.

అయితే బీజేపీతో పొత్తు వ్యవహారం జేడీఎస్ లో నిప్పు రాజేసింది. కాషాయ పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవెగౌడ, కుమారస్వామి కావాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని.. తాము మాత్రం అందుకు సిద్ధంగా లేమని చెప్పారు. అసలైనా జేడీఎస్ పార్టీ తమదేనన్నారు.

కొందరు ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని ఇబ్రహీం తెలిపారు. జేడీఎస్ అగ్రనేతలు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నేతలతో ఇబ్రహీం సమావేశాలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలో జేడీఎస్ లో చీలికలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే పరిస్థితి మరింత ముదరకముందే దేవెగౌడ చర్యలకు పూనుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీంను తొలగించి ఆ స్థానంలో తన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని నియమించారు.

గురువారం బెంగళూరులో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పదాధికారులు, కోర్ కమిటీ సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర శాఖ అడ్ హక్ అధ్యక్షుడిగా కుమారస్వామిని నియమిస్తున్నట్లు దేవెగౌడ ప్రకటించారు. ఇబ్రహీంను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదని చెప్పారు. ఆయన ఎలాంటి నిర్ణయమైనా తీసుకునేందుకు సర్వ స్వతంత్రుడని దేవెగౌడ వ్యాఖ్యానించారు. దేవెగౌడ తీసుకున్న చర్యల ద్వారా ఇబ్రహీం తనంతట తానే పార్టీ నుంచి వైదొలిగేలా చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  20 Oct 2023 3:46 AM GMT
Next Story