Telugu Global
National

డేరా బాబా.. జైలులో ఉన్నా లేనట్టే

గతేడాది 3 సార్లు డేరాబాబా పెరోల్ పై బయటకు వచ్చారు. ఈ ఏడాది ఇప్పుడు కొత్తగా మళ్లీ పెరోల్ గేమ్ మొదలు పెట్టారు. ఆయన తలచుకుంటే వెంటనే ప్రభుత్వం కనికరిస్తుంది.

డేరా బాబా.. జైలులో ఉన్నా లేనట్టే
X

భారత్ లో లైంగిక దాడులు పెరిగిపోతున్నాయిు, నిందితుల్ని కఠినంగా శిక్షించండి అంటూ ఓవైపు ఆందోళనలు పెరుగుతున్నాయి. మరో వైపు ప్రభుత్వాలు మాత్రం బిల్కిస్ బానో వంటి కేసుల్లో రేపిస్ట్ లకు క్షమాభిక్ష పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. డేరా బాబా ఉదంతం దీనికి మరో ఉదాహరణ. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు డేరా బాబా శిష్యగణాన్ని ప్రసన్నం చేసుకోడానికి ఆయనకు పెరోల్ ఇప్పించి బయటకు తెప్పించారని బీజేపీపై ఆరోపణలున్నాయి. ఇప్పుడు మరోసారి డేరా బాబాకు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం 40రోజుల పెరోల్ మంజూరు చేసింది.

గతేడాది 3 సార్లు డేరాబాబా పెరోల్ పై బయటకు వచ్చారు. ఈ ఏడాది ఇప్పుడు కొత్తగా మళ్లీ పెరోల్ గేమ్ మొదలు పెట్టారు. ఆయన తలచుకుంటే వెంటనే ప్రభుత్వం కనికరిస్తుంది, అర్జంట్ గా ఆయన పెరోల్ పై బయటకు వచ్చి చేయాల్సిన పనులు కనపడతాయి. నిబంధనల ప్రకారమే ఆయనకు పెరోల్ ఇస్తారు. ఆయన బయటకొచ్చి ప్రసంగాలు ఇస్తుంటారు. రేప్ కేసులో 20ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ.. బయటకొచ్చి సత్సంగం చేస్తున్నారంటే ఇలాంటి పరిస్థితులు భారత్ లో తప్ప ఇంకెక్కడా కనిపించవు అనే విమర్శలు వినపడుతున్నాయి. గతేడాది పెరోల్ నవంబర్ 25తో ముగిసింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఆయనకు హర్యానా ప్రభుత్వం పెరోల్ మంజూరు చేసి విమర్శలపాలవుతోంది.

డేరా బాబా జైలులో ఉన్నా లేనట్టే లెక్క. పేరుకే 20ఏళ్ల జైలుశిక్ష. కానీ ప్రభుత్వ నిర్వాకంతో ఆయన జైలులో కంటే బయటే ఎక్కువ కనిపిస్తున్నారు. భక్తులకు ఉపదేశాలిస్తున్నారు. డేరా బాబాకు మళ్లీ 40 రోజుల పెరోల్ ఇవ్వడాన్ని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు హర్జీందర్ సింగ్ ధామి తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అతడికి మేలు చేస్తోందని విమర్శించారాయన. ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి, 20 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న దోషికి.. ఇలాంటి వెసులుబాట్లు ఇవ్వడమేంటని మండిపడ్డారు. సాధారణ ఖైదీల పెరోల్ దరఖాస్తులను బుట్టదాఖలు చేసే అధికారులు, ప్రభుత్వాలు, డేరాబాబా వంటి రేపిస్ట్ లను జన సమూహంలోకి ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. అయితే నిబంధనల ప్రకారమే డేరా బాబాకు పెరోల్‌ పై విడుదలయ్యే అవకాశం లభించిందని రోహ్ తక్‌ డివిజినల్‌ కమిషనర్‌ సంజీవ్‌ వర్మ తెలిపారు. అధికారిక లాంఛనాల ప్రకారమే ఆయన్ను బయటకు పంపిస్తున్నారు.

First Published:  21 Jan 2023 2:20 AM GMT
Next Story