Telugu Global
National

జడ్జిల నియామకంలో తప్పిన సమతుల్యత

మొత్తం 537 మంది జడ్జిల్లో 1.3% మంది ఎస్టీలు, 2.8% ఎస్సీలు, 11% బీసీలు, 2.6% మైనార్టీలకు చెందినవారు హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా అవకాశం పొందారు. ఈ అసమానతలపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఆందోళన వ్యక్తం చేసింది.

జడ్జిల నియామకంలో తప్పిన సమతుల్యత
X

ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం వ్యవస్థపై అనేక విమర్శలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల కొలీజియం వ్యవస్థను గట్టిగానే టార్గెట్ చేస్తోంది. న్యాయమూర్తులు కేసుల విచారణ కంటే తదుపరి న్యాయమూర్తులుగా ఎవరిని నియమించాలని దానిపైన ఎక్కువగా దృష్టి పెడుతున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి ఇటీవల విమర్శలు కూడా చేశారు .

న్యాయమూర్తులే న్యాయమూర్తులని నియమించుకునే వ్యవస్థ ఇక్కడ మాత్రమే ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్జిలా నియామకం బాధ్యతల్ని కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోనికి తీసుకోవాలన్న ఉద్దేశంతోనే కొలీజియం వ్యవస్థ పై కేంద్ర న్యాయ శాఖ మంత్రి విమర్శలకు దిగారన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. ఇప్పుడు కొలీజియం వ్యవస్థను ఇరుకున పెట్టేలా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ నివేదిక ఉంది.

పార్లమెంటరీ స్థాయి సంఘానికి ఈ నివేదికను అందజేశారు. గత ఐదేళ్ల కాలంలో జరిగిన న్యాయమూర్తుల నియామకంలో ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయమే జరిగిందని ఈ నివేదిక చెబుతోంది. గడిచిన ఐదేళ్ల కాలంలో అంటే 2018 నుంచి 2022 డిసెంబర్ 19 వరకు దేశంలోని హైకోర్టులో 537 మందిని జడ్జిలుగా నియమించగా వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన న్యాయమూర్తులు కేవలం 17.7 శాతం మాత్ర‌మే.

మొత్తం 537 మంది జడ్జిల్లో 1.3% మంది ఎస్టీలు, 2.8% ఎస్సీలు, 11% బీసీలు, 2.6% మైనార్టీలకు చెందినవారు హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా అవకాశం పొందారు. ఈ అసమానతలపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కొలీజియం వ్యవస్థకు న్యాయమూర్తుల నియామక బాధ్యతల్ని కట్టబెట్టి మూడు దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ హైకోర్టుల్లో వెనుకబడిన వర్గాల జడ్జిల సంఖ్య పెరగడం లేదని స్పష్టం చేసింది.

జడ్జిలుగా ఎవరిని నియమించాలన్నది కొలీజియం వ్యవస్థ నిర్ణయిస్తున్న అంశాన్ని నివేదికలో ప్రధానంగా ప్రస్తావించారు. కొలీజియం సిఫార్సులను కేవలం ఆమోదించడం వరకే కేంద్ర ప్రభుత్వ బాధ్యత పరిమితం అవుతోందని వెల్లడించింది. ఇక ముందైనా న్యాయమూర్తులుగా నియామకానికి పేర్లను ప్రతిపాదించే సమయంలో వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాధాన్యత ఉందా..? లేదా..? అన్నది సరిచూసుకోవాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ సూచించింది.

First Published:  2 Jan 2023 5:09 AM GMT
Next Story