Telugu Global
National

వైద్యుల నిర్లక్ష్యం : డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి రసం

ఉత్తరప్రదేశ్‌లో ఓ బ్లడ్ బ్యాంకు నిర్వాకం, వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. బ్లడ్ బ్యాంకు ప్లాస్మాకు బదులుగా బత్తాయి రసం సరఫరా చేయగా.. వైద్యులు కనీసం దాన్ని పరిశీలించకుండానే రోగికి ఎక్కించడంతో అతడు మృతి చెందాడు.

వైద్యుల నిర్లక్ష్యం : డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి రసం
X

వైద్యం అందించే సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. సీరియస్ కేస్ అంటూ ఆసుపత్రికి వెళ్తే తాపీగా చచ్చిపోయాడంటూ వైద్యులు చెబితే ఇంటికొచ్చిన తర్వాత మళ్లీ రోగి శరీరంలో కదలికలు కనిపించాయంటూ కుటుంబీకులు మళ్లీ ఆసుపత్రులకు తీసుకెళ్తున్న ఘటనలకు సంబంధించి తరచూ వార్తలు వింటుంటాం.

గత ఏడాది తెలంగాణలోని భువనగిరిలో ఓ గర్భిణికి ప్రసవం చేసిన వైద్యులు ఆమె కడుపులో దూది పెట్టి కుట్లు వేశారు. ఆమె ఏడాది పాటు కడుపు నొప్పితో బాధపడి చివరికి కన్ను మూసింది. అలాగే కొన్ని నెలల కిందట నెల్లూరులో ఓ డాక్టర్ ఆసుపత్రిలో ఉండి కూడా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వచ్చిన ఒక రోగికి ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్లతో కుట్లు వేయించడంతో అతడు మృతి చెందాడు. ఇలా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగులు బలి కావాల్సి వస్తోంది.

ఇదే విధంగా ఉత్తరప్రదేశ్‌లో ఓ బ్లడ్ బ్యాంకు నిర్వాకం, వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. బ్లడ్ బ్యాంకు ప్లాస్మాకు బదులుగా బత్తాయి రసం సరఫరా చేయగా.. వైద్యులు కనీసం దాన్ని పరిశీలించకుండానే రోగికి ఎక్కించడంతో అతడు మృతి చెందాడు. ఈ సంఘటన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత ఇలాఖా అయిన ప్రయాగ్ రాజ్‌లో వెలుగు చూసింది.

ప్రయాగ్ రాజ్‌లో ఉన్న గ్లోబల్ ఆస్పత్రిలో ఇటీవల డెంగ్యూతో బాధపడుతున్న ఓ వ్యక్తి చికిత్స కోసం చేరాడు. చికిత్సలో భాగంగా అతడికి ప్లాస్మా ఎక్కించాలని వైద్యులు నిర్ణయించారు. ఇందుకోసం సమీపంలోని బ్లడ్ బ్యాంకును సంప్రదించారు. బ్లడ్ బ్యాంకు సిబ్బంది ప్లాస్మా బ్యాగులో ప్లాస్మాకు బదులుగా బత్తాయి రసం నింపి ఇచ్చారు.

వైద్యులు రోగికి చికిత్స అందించే సమయంలో ప్లాస్మా బ్యాగులో ఏముందో కూడా పరిశీలించకుండానే అతడి శరీరంలోకి బత్తాయి రసం ఎక్కించారు. దీంతో అస్వస్థతకు గురైన రోగి మృతి చెందాడు. కాగా ప్లాస్మా బ్యాగులో ప్లాస్మాకు బదులుగా బత్తాయి రసం ఉండడం రోగి బంధువు ఒకరు గమనించారు. బత్తాయి రసం ఉన్న ప్లాస్మా బ్యాగును చూపిస్తూ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో బ్లడ్ బ్యాంకు నిర్వాకం, వైద్యుల నిర్లక్ష్యంపై విమర్శలు వెళ్ళువెత్తాయి. దీంతో ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.

First Published:  21 Oct 2022 7:33 AM GMT
Next Story