Telugu Global
National

మతం విషయంలో పంతం నెగ్గించుకున్న బీజేపీ.. ఢిల్లీ మంత్రి రాజీనామా..

తాను అనేక సంకెళ్ల నుంచి విముక్తి పొందానని చెప్పారు మంత్రి గౌతమ్, రాజీనామాతో ఆ సంకెళ్లు తెంచుకుని తాను మళ్లీ జన్మించానన్నారు.

మతం విషయంలో పంతం నెగ్గించుకున్న బీజేపీ.. ఢిల్లీ మంత్రి రాజీనామా..
X

లిక్కర్ స్కామ్ అన్నారు, కొండను తవ్వి ఎలుకను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉచిత కరెంటు స్కామ్ అన్నారు, ఎంక్వయిరీ మొదలు పెట్టారు. అవినీతి, అక్రమాలంటూ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న బీజేపీ ఆ విషయంలో ఎక్కడా ముందడుగు వేయలేకపోయింది, ఇప్పుడు మతమార్పిడులు అంటూ ఏకంగా ఓ మంత్రినే టార్గెట్ చేసింది, రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చింది. ఢిల్లీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్‌ గౌతమ్ తన పదవికి రాజీనామా చేశారు. మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొనటంపై కలకలం రేగడంతో ఆయనే స్వచ్ఛందంగా పదవినుంచి తప్పుకున్నారు. తనతోపాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కూడా వివాదంలోకి లాగుతున్నారని, అది తనకు ఇష్టం లేదని చెప్పిన గౌతమ్, పదవికి రాజీనామా చేశారు.

మహర్షి వాల్మీకి జయంతి రోజున, మాన్య కాన్షీరామ్ వర్ధంతి రోజున.. యాదృచ్ఛికంగా తాను అనేక సంకెళ్ల నుంచి విముక్తి పొందానని చెప్పారు గౌతమ్, రాజీనామాతో ఆ సంకెళ్లు తెంచుకుని తాను మళ్లీ జన్మించానన్నారు. ఇకపై ఎలాంటి ఆంక్షలు లేకుండా మరింత దృఢంగా సమాజం హక్కులకోసం, దౌర్జన్యాలపై పోరాడతానంటూ ఆయన ట్వీట్ చేశారు. రాజీనామా లేఖను కూడా ట్విట్టర్లో ఉంచారు.

దసరా రోజున సామూహికంగా 7వేల మంది హిందువులు బౌద్ధమతంలో చేరారు. మత స్వేచ్ఛను ఎవరూ కాదనలేరు కానీ, ఇలాంటి కార్యక్రమాలకు ఢిల్లీ మంత్రి హాజరు కావడం మాత్రం విశేషం. ఈ తరహా కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగినా, ఇతర మతాల నుంచి ఎవరైనా హిందూమతంలోకి వచ్చినా పెద్దగా ఆక్షేపణ ఉండేది కాదు. కానీ ఇప్పుడు హిందూమతం నుంచి బౌద్ధమతంలోకి 7వేలమందిని మార్చడం, ఆ సభలో మంత్రి గౌతమ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కలకలం రేగింది. బీజేపీ నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి. మంత్రి వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. అదే సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. గుజరాత్ ఎన్నికల విషయంలో కూడా ఈ వ్యవహారం ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం చేకూరుస్తుందనే అనుమానం ఉంది. కేజ్రీవాల్ పర్యటనలో కూడా నిరసన సెగలు చెలరేగాయి. దీంతో మంత్రి గౌతమ్ స్వచ్ఛందంగా పదవినుంచి తప్పుకున్నారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డారు.

First Published:  10 Oct 2022 1:35 AM GMT
Next Story