Telugu Global
National

నేడు పార్లమెంట్ కి ఢిల్లీ ఆర్డినెన్స్.. INDIA ఎంపీల వ్యూహమేంటి..?

ఢిల్లీ ఆర్డినెన్స్ ని ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశముంది. ‘నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్ (సవరణ) బిల్లు’పై ఇప్పుడు అందరికీ ఆసక్తి నెలకొంది.

నేడు పార్లమెంట్ కి ఢిల్లీ ఆర్డినెన్స్.. INDIA ఎంపీల వ్యూహమేంటి..?
X

మణిపూర్ వ్యవహారంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గందరగోళంగా మారాయి. ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు సభ ఆమోదం తెలిపిన తర్వాత కూడా పలు కీలక బిల్లులను అధికార పక్షం ఆమోదించుకోవడం విపరీత పరిణామం. అధికారం చేతిలో ఉందని, సభా సంప్రదాయాలను కూడా తుంగలో తొక్కారంటూ ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయి. ఈ దశలో ఢిల్లీ ఆర్డినెన్స్ ని ఈరోజు సభలో ప్రవేశపెట్టే అవకాశముంది. ‘నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ గవర్నమెంట్ (సవరణ) బిల్లు’పై ఇప్పుడు అందరికీ ఆసక్తి నెలకొంది.

ఢిల్లీలోని అధికారుల బదిలీ, పోస్టింగ్‌ కు సంబంధించిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లును లోక్‌సభ ఎంపీలకు సర్క్యులేట్ చేయడంతో.. ఈరోజు సభలో దీన్ని ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చాలా రోజులుగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల నుంచి మద్దతు కూడగట్టారు. ఆర్డినెన్స్ అంశంపై కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలనే షరతుతో ఆమ్ ఆద్మీ పార్టీ విపక్షాల కూటమి రెండో సమావేశంలో పాల్గొంది. ప్రతిపక్ష పార్టీల్లో చాలా వరకు కేజ్రీవాల్‌కు మద్దతు పలుకుతున్నాయి. జులై 25న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లుని ఆమోదించారు. ఇప్పుడు లోక్ సభ ముందుకు తెస్తున్నారు.

INDIA వ్యూహమేంటి..?

అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడంలో INDIA వ్యూహం ఫలించింది. అయితే చర్చ మొదలుకాకుండానే సభలో మిగతా బిల్లులు ఆమోదం పొందడం మాత్రం ఆందోళనకలిగించే విషయం. ఈ దశలో ఇప్పుడు ఢిల్లీ ఆర్డినెన్స్ కూడా బిల్లు రూపంలో సభ ముందుకు వస్తోంది. ఈ దశలో INDIA ఎంపీలు ఏం చేస్తారనేదే ఆసక్తిగా మారింది. ఈ ఉదయం మల్లికార్జున్ ఖర్గే చాంబర్ లో ప్రతిపక్ష కూటమి నాయకులు సమావేశం కాబోతున్నారు. ప్రతిపక్షాలు వ్యతిరేకించినా ఈ బిల్లుని ఉభయ సభల్లో ఆమోదింపజేసుకోడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది.

First Published:  31 July 2023 1:53 AM GMT
Next Story