Telugu Global
National

నిరసనలు, వాకౌట్ల మధ్య ఢిల్లీ బిల్లుకు లోక్ సభ ఆమోదం

దేశ రాజధానిలో ప్రభుత్వ అధికారులను నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని గతంలో సుప్రీంకోర్డు తీర్పునిచ్చింది. ఆ ఆదేశాలను పక్కనపెడుతూ ఇప్పుడు కేంద్రం చట్టం తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే లోక్ సభలో బిల్లు ఆమోదం పొందింది.

నిరసనలు, వాకౌట్ల మధ్య ఢిల్లీ బిల్లుకు లోక్ సభ ఆమోదం
X

ఢిల్లీ ఆర్డినెన్సు బిల్లు విషయంలో బీజేపీ పంతం నెగ్గించుకుంది. నిరసనల మధ్యే లోక్‌ సభలో బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్‌ చేశాయి. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సుశీల్ కుమార్ రింక్ వెల్‌ లోకి దూసుకెళ్లారు. బిల్లు పేపర్లు చింపి స్పీకర్‌ టేబుల్‌ పైకి విసిరేశారు. సభాగౌరవానికి భంగం కలిగించారనే కారణంతో సుశీల్ కుమార్ ను ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్.

దేశ రాజధానిలో ప్రభుత్వ అధికారులను నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని గతంలో సుప్రీంకోర్డు తీర్పునిచ్చింది. ఆ ఆదేశాలను పక్కనపెడుతూ ఇప్పుడు కేంద్రం చట్టం తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే లోక్ సభలో బిల్లు ఆమోదం పొందింది. దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించిన ఏదైనా అంశంపై చట్టాలను రూపొందించే హక్కు పార్లమెంటుకు ఉందని, ఢిల్లీ కోసం చట్టాలు చేయడానికి కేంద్రాన్ని అనుమతించే నిబంధనలు రాజ్యాంగంలో ఉన్నాయని పేర్కొన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.

మోసం, ద్రోహం..

గతంలో బీజేపీ.. ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇప్పుడు ఉన్న అధికారాలను కూడా లాగేసుకుందని మండిపడ్డారు కేజ్రీవాల్. ట్విట్టర్లో ఆయన ఘాటుగా స్పందించారు. అధికారుల పోస్టింగ్ లు, బదిలీలపై రాష్ట్ర నియంత్రణను తీసివేసే బిల్లుని తీవ్రంగా తప్పుబట్టారాయన. ఈ రోజు బీజేపీ నాయకులు ఢిల్లీ ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. 2014లో మోదీ ప్రధాని అయ్యాక ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని చెప్పారని, ఆయన మాట తప్పారని, ఇకనుంచి ప్రజలెవరూ మోదీని నమ్మొద్దని అన్నారు.

రాజ్యసభలో ఎలా..?

ప్రస్తుతం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది. రాజ్య సభలో చర్చకు రావాల్సి ఉంది. అయితే రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 110 మంది ఎంపీలే ఉన్నారు. కాంగ్రెస్‌సహా అన్ని విపక్ష పార్టీలు కలుపుకుని 128 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో.. పెద్దల సభలో బిల్లును ఓడించగలమని ధీమాతో విపక్ష కూటమి ఉంది. కానీ తటస్థ పార్టీలు బీజేపీకి మద్దతిచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

First Published:  3 Aug 2023 3:17 PM GMT
Next Story