Telugu Global
National

ప్రజలను పక్కదోవపట్టించకండి... బాబా రాందేవ్ కు ఢిల్లీ హైకోర్టు హెచ్చరిక‌

బాబా రాందేవ్ కు ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. అల్లోపతి వైద్యంపై ఆయన చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపేయాలని హెచ్చరించింది.

ప్రజలను పక్కదోవపట్టించకండి... బాబా రాందేవ్ కు ఢిల్లీ హైకోర్టు హెచ్చరిక‌
X

అల్లోపతి వైద్యం, మందులకు వ్యతిరేకంగా ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని ఢిల్లీ హైకోర్టు బుధవారం బాబా రామ్‌దేవ్ ను హెచ్చరించింది.కోవిడ్ 19 వ్యాక్సిన్ పై రాందేవ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కోర్టు తప్పుపట్టింది.

కోవిడ్-19 సోకిన చాలా మంది మరణాలకు అల్లోపతి కారణమని, పతంజలి ప్రొడక్ట్ అయిన‌ కరోనిల్ కోవిడ్ 19 ను తగ్గిస్తుందని చెప్తూ రాందేవ్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారనే ఆరోపణపై పలు వైద్య‌ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ అనుప్ జైరామ్ భంభానీ ''మీకు వేలాది మందు అనుచరులు ఉండటం మంచిదే కానీ మీరు లేనిది ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించకండి'' అని అన్నారు.

ఇటీవల కూడా కోవిడ్19 కు కరోనిల్ సరైన మందు అంటూ రామ్‌దేవ్ అడ్వర్టైజింగ్ లు చేశారని సీనియర్ న్యాయవాది అఖిల్ సిబల్ కోర్టుకు తెలిపారు.

కరోనిల్‌కు మంజూరు చేసిన లైసెన్స్ లో కోవిడ్-19 గురించి అస్సలు ప్రస్తావించలేదని, ఇది రోగనిరోధక శక్తిని పెంచే మందుగానే ఆ లైసెన్స్ లో పేర్కొన్నారని సిబల్ కోర్టుకు తెలిపారు. రామ్‌దేవ్ చేసిన కొన్ని ప్రకటనలలో,అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ టీకా తీసుకున్న తర్వాత కూడా కరోనా బారినపడిన అంశంపై మాట్లాడారని సిబల్ కోర్టు దృష్టికి తెచ్చారు.

దీనిపై స్పందించిన జస్టిస్ అనుప్‌ జైరాం భంభాని రాందేవ్ ను ఉద్దేశించి, '' ఇక్కడ మీరు వ్యక్తుల పేర్లు ఉపయోగిస్తున్నారు. అది విదేశాలతో మన దేశ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ నేతల పేర్లను సూచించటం వల్ల వారితో ఉన్న మన సంబంధాలు దెబ్బతింటాయి. మీరు చేసిన ప్రకటన అల్లోపతి ఔషధాలపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది. మీరు ఏది చెప్పినా నమ్మే ‍అనుచరులను కలిగి ఉండటం మంచిదే కానీ, దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు.' అని పేర్కొన్నారు.

First Published:  18 Aug 2022 11:48 AM GMT
Next Story