Telugu Global
National

కొన్ని గంటల్లోనే రెండు పార్టీలు మారిన నాయకులు

ఢిల్లీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలీ మెహదీ, ఆయనతో పాటు ఇద్దరు కార్పోరేటర్లు రాత్రి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. శనివారం పొద్దున్నే తిరిగి కాంగ్రెస్ శిబిరానికి చేరుకున్నారు.

కొన్ని గంటల్లోనే రెండు పార్టీలు మారిన నాయకులు
X

రాజకీయ నాయకులు పార్టీలు మారడం మాములు విషయమే. ముఖ్యంగా ఎన్నికలప్పుడు, ఫలితాల వెంటనే నాయకుల జంపింగ్ లు ఎక్కువగా ఉంటాయి. ఢిల్లీలో కూడా అదే జరిగింది. అయితే ఆ ముగ్గురు నాయకులు ఒక జంప్ తో సరిపెట్టుకోలేదు. నిన్న రాత్రి జంప్ చేసి ఓ పార్టీలో చేరిన నాయకులు తెల్లవారు జామున మళ్ళీ వెనక్కి జంప్ చేసి పాత పార్టీలోనే చేరిపోయారు.

ఢిల్లీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలీ మెహదీ, ఆయనతో పాటు ఇద్దరు కార్పోరేటర్లు రాత్రి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. శనివారం పొద్దున్నే తిరిగి కాంగ్రెస్ శిబిరానికి చేరుకున్నారు.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 250 వార్డులకు గాను 134 స్థానాలను గెలుచుకుని ఆప్ నిర్ణయాత్మక విజయాన్ని సాధించింది. ఎన్నికలలో తొమ్మిది మంది కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు, అయితే కాంగ్రెస్ కార్పోరేటర్లు సబిలా బేగం, నాజియా ఖాతూన్ ఆప్‌లో చేరినట్లు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ సభ్యుల‌ సంఖ్య ఏడుకు తగ్గింది. వీరిద్దరినీ తీసుకొని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలీ మెహదీ రాత్రి ఆప్ లో చేరాడు. కేజ్రీవాల్ పని తీరు చూసి వీరు తమ పార్టీలో చేరారని ఆప్ నేత దుర్గేష్ పాఠక్ ఆ సమయంలో ప్రకటించారు.

అయితే అలీ మెహదీ కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఆప్ లో చేరాడన్న విషయం తెలుసుకున్న స్థానిక కార్యకర్తలు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాత్రంతా ఆయనకు నిద్ర లేకుండా చేశారు. కార్యకర్తల నిరసనలకు భయపడ్డ మెహదీ తెల్లవారు జామున ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ లో చేరాడు.త‌న‌తో పాటు ఆప్‌లో చేరిన ముస్తఫాబాద్ కార్పోరేటర్ సబిలా బేగం, బ్రిజ్‌పురి కార్పోరేటర్ నాజియా ఖాతూన్‌లు కూడా తిరిగి కాంగ్రెస్‌లో చేరారని ఆయన తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేసిన మెహదీ తాను రాహుల్ గాంధీకి నమ్మిన బంటునంటూ కామెంట్ చేశాడు.

First Published:  10 Dec 2022 5:48 AM GMT
Next Story