Telugu Global
National

ఢిల్లీ ఉచిత కరెంట్ పై బీజేపీ పగ..

ఆమ్ ఆద్మీ పార్టీ తగ్గేది లేదంటోంది. విచారణ పేరుతో భయపెట్టలేరని అంటున్న కేజ్రీవాల్ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మరింత జోరు పెంచారు.

ఢిల్లీ ఉచిత కరెంట్ పై బీజేపీ పగ..
X

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తోంది. ఇదే హామీతో అటు గుజరాత్ లో కూడా అధికారంలోకి రావాలని చూస్తోంది. గుజరాత్ ఎన్నికల్లో ఉచిత కరెంటు హామీ ప్రభావం బలంగా ఉంటుందని బీజేపీ కూడా భయపడుతోంది. ఈ భయంతోనే ఇప్పుడు ఢిల్లీ ఫ్రీ పవర్ ని కట్ చేయాలని చూస్తోంది. తాజాగా ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఉచిత కరెంట్ పథకంపై విచారణకు ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ సబ్సిడీలో చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు చేపట్టాలని ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏడు రోజుల్లోపు నివేదిక కావాలన్నారు. విద్యుత్ సరఫరా చేసే ప్రైవేటు సంస్థలకు ఢిల్లీ ప్రభుత్వం చేస్తోన్న చెల్లింపులపై విచారణ జరపబోతున్నారు.

ఢిల్లీలో నిబంధనలకు లోబడి కరెంటు వాడిన పేదల తరపున ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు బిల్లులు చెల్లిస్తోంది. ఢిల్లీ ప్రజలు ఈ పథకంపై సంతృప్తిగా ఉన్నారు. ఇదే స్ట్రాటజీని గుజరాత్ ఎన్నికల్లో కూడా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు కేజ్రీవాల్. అయితే గుజరాత్ విషయంలో బీజేపీ చాలా సీరియస్ గా ఉంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ మనుగడ కష్టం అనే నిర్ణయానికి వచ్చారు నాయకులు. అందుకే కేజ్రీవాల్ ని నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

మద్యంతో మొదలై కరెంటు వరకు..

ఆ మధ్య ఢిల్లీ మద్యం పాలసీపై కూడా వివాదం చెలరేగింది. ప్రభుత్వం ఆ పాలసీని వెనక్కు తీసుకున్నా, విచారణ పేరుతో కొండను తవ్వే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. అయినా ఆమ్ ఆద్మీ పార్టీ తగ్గేది లేదంటోంది. విచారణ పేరుతో భయపెట్టలేరని అంటున్న కేజ్రీవాల్ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మరింత జోరు పెంచారు. దీంతో ఇప్పుడు ఉచిత కరెంటు హామీపైనే బీజేపీ గురిపెట్టింది. ఇందులో భాగంగానే లెఫ్ట్ నెంట్ గవర్నర్ విచారణకు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై కేజ్రీవాల్ కూడా దీటుగా స్పందించారు. ఉచిత విద్యుత్ హామీని గుజరాత్ ప్రజలు కూడా ఇష్టపడుతున్నారని, అందుకే ఢిల్లీలో ఉచిత విద్యుత్‌ పథకాన్ని నిలిపివేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారాయన. "ఢిల్లీ ప్రజలారా.. నన్ను నమ్మండి. ఈ పథకాన్ని నేను ఆగనివ్వను. గుజరాత్ ప్రజలారా.. నన్ను నమ్మండి. మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే.. మార్చి-1 నుంచి మీకు ఉచిత విద్యుత్ అందుతుంది" అని హామీ ఇచ్చారు కేజ్రీవాల్.

First Published:  5 Oct 2022 3:23 AM GMT
Next Story