Telugu Global
National

ఆ ఉచితాలు అనుచితం కానేకాదు - మోడీకి కేజ్రీవాల్ కౌంటర్

విమర్శలు చేస్తున్నవారు మరి వేల కోట్లు వెచ్చించి విమానాలు, ప్రైవేట్ జెట్లు ఎందుకు కొన్నారని ప్రశ్నించారు.

ఆ ఉచితాలు అనుచితం కానేకాదు - మోడీకి కేజ్రీవాల్ కౌంటర్
X

ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ఉచిత హామీలపై పడ్డారు. తొలిదశలో తాను ప్రధాని కావడానికి నరేంద్ర మోడీ కూడా అనేక ఉచిత హామీలు ఇచ్చారు. ఒక్కో వ్యక్తికి 15 లక్షల రూపాయలు ఇస్తామన్న అసాధారణ హామీ కూడా అందులో ఉంది. రాష్ట్రాల్లో గెలుపు కోసం బీజేపీ నాయకులు ఇస్తున్న హామీల మోతాదు కూడా అంతే స్థాయిలో ఉంది.

ఆ సమయంలో నరేంద్ర మోడీ సొంత పార్టీ నేతలకు ఉచితాలు ప్రమాదకరమన్న హెచ్చరిక చేయలేదు. ఇప్పుడు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఉచితాలను వ్యతిరేకిస్తున్నారు. ఉచిత హామీలతో ఓట్లు అడిగే విధానంపై ప్రజలను హెచ్చరించారు నరేంద్ర మోడీ. ఉచిత హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకోవడం ఒక స్వీట్ కల్చర్ అంటూ ఉత్తరాధిలో బాగా పేరు ఉన్న తీపి వంటకం రేవ్డితో పోల్చారు మోడీ.

ఉచిత హామీలు దేశానికి ఎంతో ప్రమాదకరమని, ఉచిత హామీల విషయంలో ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఉత్తరప్రదేశ్లో ఒక రహదారిని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీలో ప్రస్తుతం డబుల్ ఇంజన్ అభివృద్ధి నడుస్తోందని తమ ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడమే కాకుండా దేశ భవిష్యత్తును కూడా నిర్మిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు.

ఇలా ప్రధాని నరేంద్ర మోడీ ఉచిత హామీల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి అంటూ వ్యాఖ్యానించడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ తనను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అనుమానాన్ని కేజ్రీవాల్ వ్యక్తం చేశారు. నన్ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నవారు మరి వేల కోట్లు వెచ్చించి విమానాలు, ప్రైవేట్ జెట్లు ఎందుకు కొన్నారని ప్రశ్నించారు.

ఢిల్లీలో ఎన్ని వస్తువుల్ని ఉచితంగా ఇస్తున్నప్పటికీ బడ్జెట్ కి లోబడే చేస్తున్నామని, ఢిల్లీ బడ్జెట్ ఇంకా మిగుల్లోనే నడుస్తోందని ఆయన గుర్తు చేశారు. ఇది తాను చెప్పిన మాట కాదని కాగ్ నివేదిక ఈ విషయాన్ని చెబుతోందని కేజ్రీవాల్ గుర్తు చేశారు. అవినీతిని అంతమొందించి ఆ డబ్బులను ప్రజల కోసం ఖర్చు చేస్తే తప్పేలా అవుతుందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వడం దేశ పునాదుల్ని బలోపేతం చేయడం అవుతుందే గాని.. అది అనుచిత ఉచితం కాబోదని వ్యాఖ్యానించారు.

ఒక కంపెనీ బ్యాంకు నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టినప్పుడు ఆ కంపెనీకి అధికార పార్టీ రుణమాఫీ చేయడమే అసలైన ప్రమాదకర ఉచితమని కేజ్రీవాల్ విమర్శించారు.

స్నేహితులకు వేల కోట్ల రుణమాఫీ చేయడం, విమానాల్లో విదేశీ పర్యటనలు చేయడం, స్నేహితులకు కాంట్రాక్టులు అప్పగించడమే ప్రమాదకరమైన ఉచితాలని కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు.

మంచినీరు , విద్యా, విద్యుత్, సరైన ఆరోగ్య సేవలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదకరమైన ఉచితాలు కావు అని కేజ్రీవాల్ విశ్లేషించారు . ఢిల్లీలో దాదాపు రెండు కోట్ల మంది ప్రజలు ఉచితంగా వైద్య సేవలు అందుకుంటున్నారని ఇదో రికార్డ్ అని కేజ్రీవాల్ చెప్పారు. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తే ప్రశ్నిస్తున్న వారు వేల యూనిట్ల విద్యుత్ వాడే మంత్రులకు ఫ్రీగా ఇవ్వడాన్ని ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.

ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడానికి కూడా తప్పు పడుతున్న వారు మరి వేలకోట్ల రూపాయలతో ప్రైవేట్ జెట్లు కొని విహరించడంపై ఏం సమాధానం చెబుతారని కేజ్రీవాల్ నిలదీశారు.

First Published:  17 July 2022 2:33 AM GMT
Next Story