Telugu Global
National

కార్పొరేట్ సంస్థలకు బీజేపీ బానిస

'ఉచిత విద్య, విద్యుత్, నీరు అందించడంలో తప్పేంటి. కేంద్ర మంత్రులకు మాత్రమే ఉచిత విద్యుత్ అందాలా?.. సామాన్యులకు ఉచిత విద్యుత్ అందించడంలో తప్పేంటో కేంద్రం స్పష్టతనివ్వాలి.

కార్పొరేట్ సంస్థలకు బీజేపీ బానిస
X

ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల మాట్లాడుతూ.. ఉచిత పథకాలు ఇవ్వడం అంత మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కార్పొరేట్లకు రూ. వేల కోట్లు రుణాలను మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం .. పేదలకు సహాయం చేస్తుంటే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నదని విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు నిరుద్యోగం, పేదరికం గురించి ఏనాడూ ఆలోచించలేదన్న వాదనలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేట్లకు మేలు చేయడమే లక్ష్యంగా సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి.

పేదలకు ఇస్తున్న ఉచిత పథకాల మీద కూడా ప్రధాని వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ విషయంపై ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ప్రభుత్వ రాయితీలు పొందుతున్నారని.. కానీ పేద ప్రజలకు ఆ అవకాశం ఉండొద్దా? అని పలువురు ప్రశ్నించారు. తాజాగా ఈ విషయంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'ఉచిత విద్య, విద్యుత్, నీరు అందించడంలో తప్పేంటి. కేంద్ర మంత్రులకు మాత్రమే ఉచిత విద్యుత్ అందాలా?.. సామాన్యులకు ఉచిత విద్యుత్ అందించడంలో తప్పేంటో కేంద్రం స్పష్టతనివ్వాలి. ఇటీవల కార్పొరేట్‌కు సంబంధించి రూ.10 లక్షల కోట్లు రుణమాఫీ ఎలా చేశారు. ఇది ఉచితం కాదా. రూ.లక్షల కోట్లు రుణమాఫీ చేసినప్పుడు ప్రజలకు ఉచిత విద్య, విద్యుత్, నీరు అందించడంలో కేంద్రం ఎందుకు విఫలమవుతోంది.' అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.

బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు బానిసని, కాంగ్రెస్ వంశపారంపర్య రాజకీయాలకు పరిమితమని, ఆమ్ ఆద్మీ పార్టీ భారత్‌వాద్ అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అవినీతిపరులను దేశద్రోహులుగా పరిగణించి.. వారికి వ్యతిరేకంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కేజ్రీవాల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పేదలు బాగుపడటం మోదీకి ఇష్టం లేదా? అని ఆయన ప్రశ్నించారు.

First Published:  8 Aug 2022 2:56 PM GMT
Next Story