Telugu Global
National

క‌శ్మీర్ సంగ‌తి మ‌రచిపోండి.. - పాక్‌ను ఉద్దేశించి రాజ్‌నాథ్ సింగ్‌ కీల‌క వ్యాఖ్య‌లు

భారత్‌లో కశ్మీర్ అంతర్భాగమని రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. కశ్మీర్ నుంచి ప్రపంచ దృష్టిని భారత్ మళ్లిస్తోందని పాకిస్తాన్ అంటోందని, ఇది నిజమని తానూ అంగీకరిస్తానని ఆయ‌న చెప్పారు.

క‌శ్మీర్ సంగ‌తి మ‌రచిపోండి.. - పాక్‌ను ఉద్దేశించి రాజ్‌నాథ్ సింగ్‌ కీల‌క వ్యాఖ్య‌లు
X

క‌శ్మీర్‌పై పాక్‌ను ఉద్దేశించి కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం ఆయ‌న జమ్మూ యూనివర్సిటీలో జరిగిన భద్రతా సదస్సులో మాట్లాడారు. `కశ్మీర్‌ను పట్టుకొని వేలాడటం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.. ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి..` అంటూ పాకిస్తాన్‌కు సూచించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు భారత్‌లో కలవాలని బలంగా కోరుకుంటున్నారని రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. ఇది చిన్న విషయం కాదని ఆయ‌న తెలిపారు.

భారత్‌లో కశ్మీర్ అంతర్భాగమని రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. కశ్మీర్ నుంచి ప్రపంచ దృష్టిని భారత్ మళ్లిస్తోందని పాకిస్తాన్ అంటోందని, ఇది నిజమని తానూ అంగీకరిస్తానని ఆయ‌న చెప్పారు. చాలా వరకు దృష్టిని మళ్లించడంలో తాము విజయం సాధించామ‌న్నారు. భారత్‌లో ఉన్న కశ్మీరీలు శాంతితో జీవనం సాగించడాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు గమనిస్తున్నారని ఆయ‌న చెప్పారు. అక్కడ వారిపై అణచివేత జరుగుతోందని తెలిపారు. అక్రమంగా పీవోకేను కబ్జా చేసినంత మాత్రాన అది పాకిస్తాన్ అయిపోద‌ని చెప్పారు.

పీవోకే భారత్‌లో భాగమ‌నే విష‌యంపై భారత పార్లమెంటు మూడుసార్లు తీర్మానం చేసింద‌ని రాజ్‌నాథ్ చెప్పారు.. పీవోకేలో ఏం జరుగుతోందో మనమంతా చూస్తున్నామ‌ని, పీవోకే ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలను చూస్తుంటే భారత్‌లో కలిపేయాలని అక్కడి నుంచే డిమాండ్ వస్తోంద‌ని తెలిపారు. టీవీల్లో కూడా వాళ్లు చాలా సార్లు భారత్‌లో తమను విలీనం చేయమని చెబుతున్నారని, ఇది చిన్న విషయం కాదని రాజ్‌నాథ్ వివ‌రించారు.

First Published:  27 Jun 2023 3:10 AM GMT
Next Story