Telugu Global
National

'డెబిట్ కార్డ్'.. గత చరిత్ర కాబోతోందా..?

ఏటీఎం మిషన్లో డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా అకౌంట్ నెంబర్, ఫోన్ కి వచ్చే ఓటీపీ తెలిస్తే చాలు. అందుకే ఏటీఎం కార్డ్ ల వినియోగం తగ్గింది, వాటి సంఖ్య కూడా తగ్గింది.

డెబిట్ కార్డ్.. గత చరిత్ర కాబోతోందా..?
X

బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరా ఉండే డెబిట్ కార్డ్ లు ఇప్పుడు మాయమైపోతున్నాయి. కార్డ్ కాలపరిమితి తీరిపోయినా చాలామంది కొత్తవాటిని తీసుకునేందుకు ఇష్టపడటంలేదు. అసలు వాటితో పనేముంది అనుకునే రోజులొచ్చేశాయి. ఏ లావాదేవీ అయినా నగదు లేకుండానే జరిగిపోతోంది. ఫోన్ పే, గూగుల్ పే.. ఇవే ఇప్పుడు హాట్ టాపిక్స్. వీటి మధ్యలో డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం కార్డ్ అనేది పూర్తిగా కనుమరుగైపోతుందనే చెప్పాలి.

క్యాష్ కావాలంటే..?

ఏటీఎం కార్డ్ లపై అవగాహన లేనివారు ఇప్పటికీ నగదు లావాదేవీలకోసం బ్యాంకుల్ని ఆశ్రయిస్తున్నారు. గతంలో ఏటీఎం కార్డ్ లు వాడేవారు ఇప్పుడు ఫోన్ కి వచ్చే ఓటీపీ ఆధారంగా ఏటీఎం నుంచి నగదు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఏటీఎంలో కార్డ్ పెట్టి లావాదేవీ చేయాల్సిన పనిలేదిప్పుడు. ఏటీఎం మిషన్లో డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా అకౌంట్ నెంబర్, ఫోన్ కి వచ్చే ఓటీపీ తెలిస్తే చాలు. అందుకే ఏటీఎం కార్డ్ ల వినియోగం తగ్గింది, వాటి సంఖ్య కూడా తగ్గింది.

క్రెడిట్ కార్డ్ లే దిక్కు..

పోనీ ఇప్పుడు కార్డ్ లు ఎవరైనా వాడుతున్నారంటే కచ్చితంగా అవి క్రెడిట్ కార్డ్ లే అయి ఉంటాయి. గతంలో బ్యాంక్ లావాదేవీలను చూసి క్రెడిట్ కార్డ్ లు ఇచ్చేవారు. ఇప్పుడు అవసరం ఉన్నవారందరికీ క్రెడిట్ కార్డ్ లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ముందు వాడుకోండి, తర్వాతే డబ్బులు కట్టండి.. అంటూ వినియోగదారుల్ని క్రెడిట్ కార్డ్ సంస్థలు బాగానే ఆకర్షిస్తున్నాయి. క్రెడిట్ కార్డ్, ఈఎంఐ అనే పదాలు ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యకృత్యమయ్యాయి.

యూపీఐ హవా..

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం యూపీఐ ఆధారిత లావాదేవీలు పెరుగుతున్నాయి. బడ్డీకొట్టు దగ్గర్నుంచి షాపింగ్ మాల్స్ వరకు యూపీఐ చెల్లుబాటవుతోంది. ఈ ఏడాది ఫిబ్రరి నాటికి యూపీఐ పేమెంట్స్ లో వార్షిక వృద్ధిరేటు 66.4 శాతంగా కేంద్రం లెక్క తేల్చింది. ఏడాది కాలంలో రూ. 126 లక్షల కోట్ల విలువ గల 750 కోట్ల యూపీఐ లావాదేవీలు దేశంలో జరిగాయి. మార్చిలోనే గణనీయమైన వృద్ధి ఉంది. యూపీఐ వల్ల డెబిట్ కార్డ్ ల వినియోగం గణనీయంగా తగ్గిపోతోంది. గతంలో డెబిట్ కార్డ్ మోసాలు కూడా ఎక్కువ. పాస్ వర్డ్ లు తస్కరించడం, కార్డుల క్లోనింగ్.. ఇలాంటివన్నీ జరిగేవి. కానీ ఇప్పుడవి కూడా తగ్గిపోయాయి. అంతమాత్రాన యూపీఐ పూర్తిగా సేఫ్ అని చెప్పలేం కానీ.. డెబిట్ కార్డ్ ల వల్ల జరిగే మోసాలన్నీ తగ్గిపోయాయనే చెప్పాలి. ప్రస్తుతం డెబిట్ కార్డ్ ల వాడకం తగ్గిందని, కొత్తవాటికి కూడా పెద్దగా ఆదరణ లేదని బ్యాంకింగ్ వర్గాలంటున్నాయి.

First Published:  18 April 2023 3:08 AM GMT
Next Story