Telugu Global
National

యూపీలో కేరళ‌ తరహా ఘటన.. ఇద్దరు దళిత విద్యార్థినుల యూనిఫారాలు విప్పించి...

ఉత్తరప్రదేశ్ లో ఓ ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్లో ఇద్దరు దళిత బాలికల యూనిఫారాలను టీచర్లు బలవంతంగా విప్పించారు. స్కూలు యూనిఫారాల్లో ఉన్న ఈ విద్యార్థినుల యూనిఫారాలను విప్పించి వాటిని (యూనిఫారం ధరించని) మరో ఇద్దరు బాలికలకు ఇచ్చారని, పైగా దీన్ని ఫోటోలు తీశారని తెలుస్తోంది.

యూపీలో కేరళ‌ తరహా ఘటన.. ఇద్దరు దళిత విద్యార్థినుల యూనిఫారాలు విప్పించి...
X

కేరళలోని కొల్లం జిల్లాలో నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థినుల లో దుస్తులు విప్పించిన ఘటన మరువక ముందే యూపీలోని హాపూర్ లో దాదాపు ఇలాంటి సంఘటన జరిగింది. హాపూర్ లోని ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్లో ఇద్దరు దళిత బాలికల యూనిఫారాలను టీచర్లు బలవంతంగా విప్పించారట.. ఈ నెల 11 న జరిగిన ఈ ఉదంతం అందర్నీ షాక్ కి గురి చేసింది. స్కూలు యూనిఫారాల్లో ఉన్న ఈ విద్యార్థినుల యూనిఫారాలను విప్పించి వాటిని (యూనిఫారం ధరించని) మరో ఇద్దరు బాలికలకు ఇచ్చారని, పైగా దీన్ని ఫోటోలు తీశారని తెలుస్తోంది. ఇద్దరు టీచర్ల ఈ బాగోతం రచ్చకెక్కింది. బాధిత దళిత బాలికల తండ్రులు ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని ఈ టీచర్లపై ఎస్సీ, ఎస్టీ చట్టంతో బాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టినట్టు హాపూర్ పోలీసులు తెలిపారు. తమ కులాన్ని చిన్నచూపు చూసిన టీచర్లు తమ కూతుళ్ళ పట్ల వివక్ష చూపారని బాలికల తండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.పైగా యూనిఫారాలు విప్పడానికి నిరాకరించినందుకు వారిని కొట్టారని, ఇదేమిటని తాము అడిగితే జవాబు చెప్పలేదని ఈ బాలికల్లో ఒకరి తల్లి తెలిపారు. పేదలైన ఈ తలిదండ్రులు ఈ విషయాన్ని సోషిత్ క్రాంతిదళ్ అనే స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు రవికాంత్ కు తెలియజేయగా ఆయన దీన్ని విద్యాశాఖ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆ ఇద్దరు టీచర్లను ఈ నెల 13 న సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. . కానీ తాము ఈ విద్యార్థినులను కొట్టలేదని, బలవంతంగా వారి యూనిఫారాలు విప్పించలేదని ఓ టీచర్ చెప్పారు. కాగా వీరిని సస్పెండ్ చేసినట్టు అధికారులు చెబుతున్నా.. వీరు యధాప్రకారం స్కూలుకు వస్తున్నారని బాధిత బాలికల తలిదండ్రులు వాపోయారు. వీళ్లపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని వారు ఆరోపించారు.

ఇలా ఉండగా హాపూర్ జిల్లా దిహరీపూర్ లో నాలుగో తరగతి చదువుతున్న ఈ దళిత బాలికలపట్ల ఇలా అమానుషం జరిగిందని, సస్పెండయిన టీచర్లు గ్రామంలో పంచాయతీ పెట్టి.. పలుకుబడిగల గ్రామ పెద్దల ద్వారా ఈ బాలికల తలిదండ్రులను పిలిపించి ఫిర్యాదును వెనక్కి తీసుకోవలసిందిగా ఒత్తిడి చేశారని రవికాంత్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ పై స్పందించిన షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్ విజయ్ సంప్లా .. ఈ కేసులో హాపూర్ పోలీసులు తీసుకున్న తదనంతర చర్యలు ఏమిటో తెలపాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ టీచర్లపై ఎఫ్ ఐ ఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. దీంతో.. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరుపుతామని, సంబంధిత టీచర్లపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేస్తామని హాపూర్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ సర్వేశ్ మిశ్రా తెలిపారు.






First Published:  19 July 2022 6:20 AM GMT
Next Story