Telugu Global
National

మంచి దుస్తులు ధ‌రించి, కళ్ళజోడు పెట్టుకున్నాడ‌ని దాడి

ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కూడా వారిపై కేసు నమోదు అయ్యింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

మంచి దుస్తులు ధ‌రించి, కళ్ళజోడు పెట్టుకున్నాడ‌ని దాడి
X

దళిత వర్గానికి చెందిన ఒక వ్యక్తి మంచి దుస్తులు ధరించి, కళ్ళజోడు పెట్టుకుని ఇంటి బయట నిల్చుని ఉండగా.. అగ్రకులానికి చెందిన కొందరు వ్యక్తులు అతడిపై దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన అతడి తల్లిపై కూడా దాడి చేశారు. గుజరాత్‌లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. బనస్కాంత జిల్లా మోటా గ్రామంలో దళిత వర్గానికి చెందిన జిగర్ షెకాలియా మంగళవారం ఉదయం తన ఇంటి ముందు నిల్చుని ఉన్నాడు. ఆ సమయంలో అతడు మంచి దుస్తులు, కళ్ళజోడు ధరించి ఉన్నాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందిన ఏడుగురు వ్యక్తులు జిగర్ షెకాలియాను చూశారు. మంచి దుస్తులు, కళ్ళజోడు ఎందుకు ధరించావు? అంటూ దుర్భాషలాడారు. వారిలో ఒక వ్యక్తి చంపేస్తానని జిగర్ షెకాలియాను బెదిరించాడు.

ఈ సంఘటన జరిగిన రాత్రి జిగర్ షెకాలియా ఊరిలో ఉన్న ఆలయం బయట ఉండగా రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందిన ఆరుగురు వ్యక్తులు కర్రలు, ఆయుధాలు చేత పట్టుకొని అక్కడికి వచ్చారు. మంచి దుస్తులు ధరిస్తావా? కళ్లద్దాలు పెట్టుకుంటావా? అంటూ అతడిని చితక్కొట్టారు. డెయిరీ పార్లర్ వెనక్కు లాగి పడేశారు. తన కుమారుడిని కాపాడుకునేందుకు బాధిత వ్యక్తి తల్లి అక్కడికి వెళ్ళగా ఆమెపై కూడా దాడి చేశారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే బట్టలు చింపేసి చంపుతామని బెదిరించారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులు ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, కుమారుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఈ కేసులో ఐపీసీ సెక్షన్ల కింద ఏడుగురిపై గడ్ పోలీస్ స్టేషన్లో అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాలు, మహిళపై దాడి చేయడం, అసభ్య పదజాలం ఉపయోగించడం తదితరాలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కూడా వారిపై కేసు నమోదు అయ్యింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

First Published:  3 Jun 2023 7:18 AM GMT
Next Story