Telugu Global
National

సుప్రీంకోర్టునే టార్గెట్ చేసిన సైబ‌ర్ నేర‌గాళ్లు.. - న‌కిలీ వెబ్‌సైట్ రూప‌క‌ల్ప‌న‌

సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా పేరుతో ఓ నకిలీ వెబ్‌సైట్‌ని సృష్టించారని, రెండు URLలను కూడా జనరేట్ చేశారని తెలిపారు. వీటితో వ్యక్తిగత వివరాలు, రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నారని చెప్పారు.

సుప్రీంకోర్టునే టార్గెట్ చేసిన సైబ‌ర్ నేర‌గాళ్లు.. - న‌కిలీ వెబ్‌సైట్ రూప‌క‌ల్ప‌న‌
X

ప‌లు సంస్థ‌లు, వ్య‌క్తులు, బ్రాండ్ల పేరుతో న‌కిలీ ఖాతాలు సృష్టించి వారి వ్య‌క్తిగ‌త స‌మాచారం దొంగిలిస్తున్న‌ సైబ‌ర్ నేర‌గాళ్లు ఈసారి ఏకంగా సుప్రీంకోర్టునే టార్గెట్ చేశారు. 'సుప్రీం కోర్టు' పేరిట ఓ నకిలీ వెబ్‌సైట్‌ని రూపొందించారు. చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ స్వ‌యంగా ఈ విషయాన్ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. ఆ సైట్ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని లాయ‌ర్లు, పిటిష‌న్‌దారుల‌ను హెచ్చ‌రించారు. మ‌రోప‌క్క‌ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కూడా దీనిపై పబ్లిక్ నోటీసు జారీ చేసింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దీనిపై మాట్లాడుతూ.. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా పేరుతో ఓ నకిలీ వెబ్‌సైట్‌ని సృష్టించారని, రెండు URLలను కూడా జనరేట్ చేశారని తెలిపారు. వీటితో వ్యక్తిగత వివరాలు, రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నారని చెప్పారు. వీటిని ఎవరూ షేర్ చేయొద్దని, అందులో రహస్య సమాచారాన్ని పంచుకోవద్దని సూచించారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఎన్నడూ ప్రజలు వ్యక్తిగత సమాచారాన్ని కోరదని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.

రిజిస్ట్రీ కూడా రహస్య వివరాలు, ఆర్థిక లావాదేవీల గురించి అడగబోమ‌ని గుర్తించాల‌ని తమ నోటీసులో పేర్కొంది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా www.sci.gov.in డొమైన్‌తో ఈ వెబ్‌సైట్‌ రిజిస్టర్ అయి ఉందని, ఈ కోర్టు పేరుతో ఏదైనా యూఆర్ఎల్ వస్తే దాన్ని క్లిక్ చేసే ముందు ఒరిజినల్ డొమైన్ సరిచూసుకోవాల‌ని సూచించింది. ఒకవేళ సైబర్ దాడికి గురైతే గనుక.. వెంటనే మీ అన్ని ఆన్‌లైన్‌ ఖాతాలు, బ్యాంక్ అకౌంట్ల పాస్‌వ‌ర్డ్‌ల‌ను మార్చుకోండి అంటూ రిజిస్ట్రీ ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఈ నకిలీ వెబ్‌సైట్ గురించి ఇప్పటికే దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్లామని, దీని వెనుక ఉన్న బాధ్యులను తప్పకుండా శిక్షిస్తామని తెలిపింది.

చీఫ్‌ జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా దీని గురించి ప్రజలను హెచ్చరించారు. నకిలీ వెబ్‌సైట్‌ల‌ పట్ల జాగ్రత్తగా ఉండాల‌ని సూచించారు. సుప్రీంకోర్టు పేరుతో వస్తున్న ఆ నకిలీ లింక్‌ల‌ను క్లిక్ చేయొద్దని చెప్పారు. దాన్ని నగదు లావాదేవీలకు ఉపయోగించొద్దని న్యాయవాదులు, వ్యాజ్యదారులకు సీజేఐ సూచించారు.

*

First Published:  31 Aug 2023 11:36 AM GMT
Next Story