Telugu Global
National

మోడీని విమర్శిస్తే.. దేశాన్ని విమర్శించినట్టేనా..?

ప్రధాని నరేంద్ర మోదీని గానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను గానీ విమర్శించడం నేరమా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇస్తుంది, ఇది విమర్శలకు లేదా వ్యంగ్యానికి సహేతుకమైన పరిమితుల పరిధికి మాత్రమే లోబడి ఉంటుంది.

మోడీని విమర్శిస్తే.. దేశాన్ని విమర్శించినట్టేనా..?
X

ప్రధాని నరేంద్ర మోదీని గానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను గానీ విమర్శించడం నేరమా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇస్తుంది, ఇది విమర్శలకు లేదా వ్యంగ్యానికి సహేతుకమైన పరిమితుల పరిధికి మాత్రమే లోబడి ఉంటుంది. అయితే, యూపీలో గత వారంలో జరిగిన రెండు అరెస్టులు ఈ స్వేచ్ఛ ఇకపై లేద‌ని స్పష్టం చేస్తున్నది.

కల్నల్‌గంజ్‌లో పోలీసులు గత వారం ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు, 1,105 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగడాన్ని ఈ హోర్డింగ్ లో ప్రింట్ చేశారు. పోస్టర్‌లో #ByeByeModi అనే హ్యాష్‌ట్యాగ్ పెద్ద అక్షరాలతో పాటు ప్రభుత్వ అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్ ను విమర్షిస్తూ కూడా వ్యాఖ్యలు ఉన్నాయి.

పోస్టర్‌ను చూసిన స్థానిక బిజెపి నాయకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్‌ 153బి ( జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే అభియోగాలు,) 505(2) (వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా దుష్ప్రవర్తనను సృష్టించడం,ప్రచారం చేయడం) కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు నమోదు చేసిన ఈ కేసులకు మద్దతుగా ప్రధాన మీడియా ప్రచారం చేసింది. ప్రధానినే విమర్షిస్తారా అంటూ వాదనలను నడిపింది. అక్కడ అతి పెద్ద నేరం జరిగిపోయిందని దేశం పరువు తీసేశారన్నట్టు హాస్యాస్పదమైన డిస్కషన్స్ నడిపింది. టైమ్స్ ఆఫ్ ఇండియా అయితే పోలీసుల అతిపెద్ద పురోగతి అంటూ... "సోమవారం సాయంత్రం కల్నల్‌గంజ్ పోలీసుల బృందం #ByeByeModi అనే టైటిల్‌తో వివాదాస్పద హోర్డింగ్‌ను ఇన్‌స్టాల్ చేశారనే ఆరోపణలపై ప్రింటింగ్ ప్రెస్ యజమాని , ఈవెంట్ ఆర్గనైజర్‌తో సహా ఐదుగురిని అరెస్టు చేసింది. అని వార్తను ప్రసారం చేసింది. దీంట్లో పోలీసుల అతి పెద్ద పురోగతి ఏంటో వాళ్ళకే తెలియాలి.

ఇక ఈ వారం యూపీలో నమోదైన రెండో కేసు అంతకన్నా హాస్యాస్పదంగా ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ యొక్క 'ఆక్షేపణీయమైన' చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఓ పాఠ‌శాల విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ చిత్రంలో ఆదిత్యనాథ్ నోటిలో పాల సీసా, తలపై షూ ఉన్నట్లుగా ఉంది. ప్రక్కన నవ్వుతున్న ఎమోజీల పరంపర. ఈ చిత్రాన్ని కన్నౌజ్‌లోని 18 ఏళ్ల పాఠశాల విద్యార్థి ఆశిష్ యాదవ్ పోస్ట్ చేశాడు.

ఒక్క సారి మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాలాన్ని గుర్తు చేసుకుందాం. 1953 లో శంకర్ అనే ప్రముఖ కార్టూనిస్టు నెహ్రూపై ఓ కార్టూన్ వేశారు. అందులో ఐక్యరాజ్యసమితిలో నెహ్రూ విఫలమయ్యారంటూ నెహ్రూ నగ్న కార్టూన్ వేశారు శంకర్. ఈ కార్టూన్ తో పోల్చుకుంటే ఆ విద్యార్థి కార్టూన్ ఎంత ? పైగా నెహ్రూ శంకర్ పై కేసు నమోదు చేయలేదు. పైగా నన్ను కూడా విడిచిపెట్టొద్దు శంకర్ అని శంకర్ కు చెప్పారు. అంతే కాదు ఆ తర్వాత కూడా నెహ్రూ 1955లో తన USSR పర్యటనలో శంకర్ ను కూడా తీసుకెళ్ళారు.

ఒక్క సారి నెహ్రూ ను, మోదీ, యోగీలను పక్కపక్క‌న పెట్టి ఆలోచిస్తే...?
ఇక ఆ విద్యార్థి ఆశిష్ యాదవ్ పై దారుణమైన IPC సెక్షన్ల కింద కేసులు బనాయించారు పోలీసులు. 153B, 505 (2), 153A, 295A, సెక్షన్ 66 ల కింద కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్లేవీ సమాచార సాంకేతిక చట్టం కిందికి రావు. ఆ ఫోటోను పోస్ట్ చేసినందుకు ఈ సెక్షన్లేవీ వర్తించవు. అయినప్పటికీ, పేద బాలుడి 'నేరాన్ని' అధికారులు చాలా తీవ్రంగా పరిగణించారు ఎంత తీవ్రంగా అంటే.. జిల్లా మేజిస్ట్రేట్ రాకేష్ కుమార్ మిశ్రా, పోలీసు సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ శ్రీవాస్తవ తాల్గ్రామ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఒక మూసి ఉన్న గదిలో విద్యార్థిని చాలా సేపు ప్రశ్నించారు." వాన‌ పామునైనా పెద్ద కర్రతో కొట్టి చంపాలన్న బీజేపీ విధానంలో ఇది కూడా భాగమేనేమో ?

ఒక్క ఉత్తరప్రదేశ్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటా ఇదే పరిస్థితి నెలకొంది. ఇలా కేసులు మోపబడి జైళ్ళలోమగ్గుతున్నవాళ్ళు వేలమంది ఉన్నారు. ఒక వేళ ఎవరికైనా పొరపాటున బెయిల్ వచ్చినా జైలునుంచి బైటికి రాకుండా మరిన్నీ కేసులు రడీగా ఉంటాయి. జర్నలిస్ట్ జుబేర్ కేసునే ఉదహరణగా తీసుకుంటే అతనిపై మొదట ఓ కేసు పెట్టి జైలుకు పంపారు. దానిపై బెయిల్ వాదనలు జరుగుతుండగానే పాత తేదీలతో మరిన్ని కేసులు మోపారు. రెండు కేసుల్లో జుబేర్ కు బెయిల్ వచ్చినా ఆయనింకా జైలు గోడల వెనకే మగ్గుతున్నాడు.

ఇలా మన దేశంలో భావప్రకటనా స్వేచ్చను ఒకవైపు హత్య చేస్తూ మరో వైపు ప్రధానిమాత్రం అంతర్జాతీయ వేదికలపై భావప్రకటనా స్వేచ్చ గొప్పతనంపై ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. భావప్రకటనా స్వేచ్చను కాపాడటానికి ప్రాణాలైనా ఇస్తానని ప్రకటనలు గుప్పిస్తూ ఉంటారు. భావప్రకటనా స్వేచ్చను కాపాడుతామన్న ప్రకటనలపై ఇతర దేశాల అధినేతలతో కలిసి సంతకాలు చేస్తూ ఉంటారు.

ఇక్కడ మాత్రం ధరలెందుకు పెరుగుతున్నాయని అడగకూడదు.... ప్రభుత్వరంగ సంస్థలను ఎందుకు తెగనమ్ముతున్నారని ప్రశ్నించకూడదు... తమ రాష్ట్రం పై వివక్ష ఎందుకు చూపిస్తున్నారని అడగకూడదు... కొంటామని హామీ ఇచ్చిన మా వరి ధాన్యాన్ని ఎందుకు కొనరు అని నిలదీయకూడదు...

ఇక చివరకు 'బై బై మోడీ' అని అస్సలు అనకూడదు.

Next Story