Telugu Global
National

యూపీలో మరో ఎన్‌కౌంటర్.. ఈసారి సురేష్ రైనా అత్తమామల హత్య కేసులో నిందితుడు..

ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు నిందితులను గత ఏడాది సెప్టెంబర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా రషీద్ అనే వ్యక్తి సురేష్ రైనా అత్తమామలను చంపినట్లు వెల్లడించారు.

యూపీలో మరో ఎన్‌కౌంటర్.. ఈసారి సురేష్ రైనా అత్తమామల హత్య కేసులో నిందితుడు..
X

ఉత్తరప్రదేశ్ లో పోలీసుల ఎన్ కౌంటర్లు కొనసాగుతున్నాయి. తాజాగా వెటరన్ క్రికెటర్ సురేష్ రైనా అత్తమామల హత్య కేసులో నిందితుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు వింటేనే దొంగలు, రౌడీలు భయపడిపోతున్నారు. ఎందుకంటే ఆయన అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గించేందుకు నేరస్థులను ఎన్ కౌంటర్లు చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. యోగి ముఖ్యమంత్రి అయ్యాక పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్లలో ఇప్పటివరకు 90 నుంచి 100 మంది వరకు నేరస్థులు చనిపోయారు. ఇప్పుడు ఏ నేరం చేసినా పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తారేమోనని నేరగాళ్లు భయపడుతున్నారు.

ఇదిలా ఉండగా.. క్రికెట‌ర్ సురేష్ రైనా అత్తమామల హత్య కేసులో నిందితుడిని పోలీసులు ముజఫర్ నగర్ లోని షాపుర్ లో సోమ‌వారం ఎన్ కౌంటర్ చేశారు. 2020 ఆగస్టు 19వ తేదీన పఠాన్ కోట్ లోని క్రికెటర్ సురేష్ రైనా అత్త, మామ ఇంట్లో రషీద్ అనే వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన రైనా మామ అశోక్ కుమార్, అత్త ఆశా, బావమరిది కౌశల్ కుమార్ లను రషీద్ తీవ్రంగా గాయపరిచి చంపేశాడు. ఈ కేసులో నిందితుడి కోసం పోలీసులు అప్పటినుంచి గాలిస్తూనే ఉన్నారు.

అయితే ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు నిందితులను గత ఏడాది సెప్టెంబర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా రషీద్ అనే వ్యక్తి సురేష్ రైనా అత్తమామలను చంపినట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న రషీద్ శనివారం కొందరు నేరగాళ్లతో కలిసి షాపుర్ కు వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు, ఎస్వోజీ బృందం రషీద్ ని అదుపులోకి తీసుకోవడానికి వెళ్ళింది.

అయితే సోరం -గయ్లా రహదారిపై తమను చూడగానే దుండగులు కాల్పులు జరిపారని ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరుపగా.. రషీద్ తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అతడిని సమీపంలోని షాపుర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారని వారు తెలిపారు. అయితే ఈ ఎన్ కౌంటర్ కూడా బూటకమేనని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

First Published:  2 April 2023 2:31 AM GMT
Next Story