Telugu Global
National

రేపిస్ట్ ల విడుదల.. గుజరాత్ కి ఆ అధికారం లేదు..

గుజరాత్ సర్కార్‌కి లేదని, వారికి శిక్ష వేసింది ముంబైలోని సెషన్స్ కోర్ట్ కాబట్టి.. మహారాష్ట్ర ప్రభుత్వానికే ఆ అధికారం ఉంటుందని చెప్పారు క్రిమినల్ లా నిపుణురాలు, సీనియర్ న్యాయవాది రెబెకా ఎం.జాన్.

రేపిస్ట్ ల విడుదల.. గుజరాత్ కి ఆ అధికారం లేదు..
X

బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు శిక్షను తగ్గించి వారిని విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం. కానీ, ఆ అధికారం గుజరాత్ సర్కార్‌కి లేదని, వారికి శిక్ష వేసింది ముంబైలోని సెషన్స్ కోర్ట్ కాబట్టి.. మహారాష్ట్ర ప్రభుత్వానికే ఆ అధికారం ఉంటుందని చెప్పారు క్రిమినల్ లా నిపుణురాలు, సీనియర్ న్యాయవాది రెబెకా ఎం.జాన్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 432(7) ప్రకారం ఈ అధికారం శిక్ష విధించిన కోర్టు ఉన్న రాష్ట్రానికే చెందుతుందని చెప్పారామె. 2015లో యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ వి శ్రీహరన్ అలియాస్ మురుగన్ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఇలాంటి తీర్పునిచ్చిందని ఆమె గుర్తుచేశారు.

బిల్కిస్ బానో కేసులో నిందితులు ఈ ఏడాది మే నెలలో శిక్ష తగ్గింపు కోసం గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేయగా.. ఆ అధికారం మహారాష్ట్రకే ఉందని కోర్టు చెప్పింది. దీన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. నేరం జరిగింది గుజరాత్ లో అని, అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ముంబై సెషన్స్ కోర్ట్ జడ్జిమెంట్ ఇవ్వాల్సి వచ్చిందని, అందుకే గుజరాత్ ప్రభుత్వానికి ఆ అవకాశం ఉందని చెప్పింది. దీంతో గుజరాత్ ప్రభుత్వం 11మందికి క్షమాభిక్ష పెట్టి విడుదల చేసింది. ఈ వ్యవహారం సంచలనంగా మారడంతో ఇప్పుడు క్షమాభిక్ష అధికారం ఏ రాష్ట్రానిది అనే చర్చ మొదలైంది. సుప్రీం న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, విక్రమ్ నాథ్‌ ఇచ్చిన జడ్జిమెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

సుప్రీంకోర్టు తీర్పును తాను గౌరవప్రదంగా విభేదిస్తున్నానని చెబుతున్నారు రెబెకా ఎం.జాన్. ఈ కేసుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారామె. స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ వర్సెస్ రతన్ సింగ్ (1976), హనుమంత్ దాస్ వర్సెస్ వినయ్ కుమార్ సహా మరికొన్ని కేసులను ఆమె ఉదాహరణలుగా చూపుతున్నారు. రాష్ట్రం-A లో నేరం జరిగినా, విచారణ జరిగి రాష్ట్రం-Bలో శిక్ష విధించిన తర్వాత.. విచారణ జరిగిన కోర్టు ఉన్న రాష్ట్రమే క్షమాభిక్ష పెట్టే అధికారాన్ని కలిగి ఉంటుందని, ఆ క్రమంలో బిల్కిస్ బానో కేసులో మహారాష్ట్ర ప్రభుత్వమే క్షమాభిక్ష పెట్టాలని, కానీ ఇక్కడ గుజరాత్ ప్రభుత్వానికి ఆ అవకాశం ఇవ్వడం సరికాదని పేర్కొన్నారామె.

నిర్భయ హంతకుల ఉరిశిక్ష విషయంలో సంబరాలు చేసుకున్న వారు, బిల్కిస్ బానో పట్ల జరిగిన అన్యాయానికి నిందితుల శిక్ష తగ్గించడాన్ని ఎందుకు సమర్థిస్తున్నారని ప్రశ్నించారామె. చట్టాల్లో ఉన్న లొసుగులను అడ్డు పెట్టుకుని ఇలా కొంతమంది నేరస్థులు పునీతులుగా బయటకు రావడం సమాజానికి తప్పుడు సంకేతాలని పంపుతుందని అంటున్నారామె. మొత్తమ్మీద పౌరసమాజం ఈ వ్యవహారాన్ని చీదరించుకోవడంతోపాటు, న్యాయనిపుణులు కూడా ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జరిగిన ప్రయోజనం అంటూ గొంతెత్తుతున్నారు. సుప్రీంకోర్ట్ లో రివ్యూ పిటిషన్ దాఖలైతే.. బిల్కిస్ బానో నిందితులు మళ్లీ జైలుకెళ్లక తప్పదని అర్థమవుతోంది.

First Published:  21 Aug 2022 5:45 AM GMT
Next Story