Telugu Global
National

ఆవు పేడ అణు రేడియేషన్ నుండి రక్షిస్తుంది,ఆవు మూత్రంతో అనేక వ్యాధులు నయమవుతాయి -గుజరాత్ కోర్టు

“ఆవు ఒక జంతువు మాత్రమే కాదు అది మనందరి తల్లి కూడా. అందుకే ఆమెను 'గోమాత' అని పిలుస్తారు... గోవుల వల్ల విశ్వానికి కలిగే ప్రయోజనాలను వర్ణించలేము. ఆవు రక్తం ఒక్క చుక్క కూడా భూమిపై పడని రోజు భూ సమస్యలన్నీ తీరి, భూలోకం క్షేమంగా ఉంటుంది.''’ అని తాపీ జిల్లా సెషన్స్ జడ్జి ఎస్.వి. వ్యాస్ అన్నారు.

ఆవు పేడ అణు రేడియేషన్ నుండి రక్షిస్తుంది,ఆవు మూత్రంతో అనేక వ్యాధులు నయమవుతాయి -గుజరాత్ కోర్టు
X

ఇళ్ళపై ఆవుపేడ పూస్తే అణు రేడియేషన్ నుండి రక్షిస్తుందని, గోవధ జరగని రోజే భూమి మీద సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని గుజరాత్‌లోని ఓ కోర్టు పేర్కొంది. రాష్ట్రం నుండి మహారాష్ట్రకు అక్రమంగా పశువులను రవాణా చేసిన కేసు విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో మహ్మద్ అమీన్ అనే వ్యక్తికి జీవిత ఖైదు విధించింది.

“ఆవు ఒక జంతువు మాత్రమే కాదు అది మనందరి తల్లి కూడా. అందుకే ఆమెను 'గోమాత' అని పిలుస్తారు... గోవుల వల్ల విశ్వానికి కలిగే ప్రయోజనాలను వర్ణించలేము. ఆవు రక్తం ఒక్క చుక్క కూడా భూమిపై పడని రోజు భూ సమస్యలన్నీ తీరి, భూలోకం క్షేమంగా ఉంటుంది.''’ అని తాపీ జిల్లా సెషన్స్ జడ్జి ఎస్.వి. వ్యాస్ అన్నారు.

"తరచుగా గోవధ, గోవుల‌ అక్రమ రవాణా సంఘటనలు సమాజానికి అవమానకరం" అని న్యాయమూర్తి నొక్కిచెప్పారు.

పాలు, పెరుగు, నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రంతో సహా ఆవు ఉత్పత్తుల ఉపయోగాలు అనేకం ఉన్నాయని కోర్టు పేర్కొంది. ఇప్పుడు రసాయనిక వ్యవసాయంతో పోలిస్తే ఆవు ఆధారిత వ్యవసాయం జనాదరణ పొందిందని కోర్టు తెలిపింది.

"సేంద్రీయ వ్యవసాయం నుండి ఉత్పత్తి చేయబడిన ధాన్యాలు అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి... ఆవు పేడ పూసిన‌ ఇళ్లపై అణు రేడియేషన్ కూడా ప్రభావం చూపదని సైన్స్ నిరూపించింది" అని కోర్టు పేర్కొంది.

నయం కాని అనేక వ్యాధులు ఆవు మూత్రం తాగ‌డం వల్ల నయమవుతాయని కూడా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

అసలు ప్రపంచ సమస్యలన్నింటికీ గోహత్యలే కారణమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

“ప్రస్తుతం ప్రపంచంలో సమస్యలు ఏమైనప్పటికీ, ఈ సమస్యలన్నింటికీ మూలం ఆవేశం, కోపతాపాలు. అవి పెరగడానికి ఏకైక కారణం గోహత్య. అందుకే గోహత్యను పూర్తిగా నిషేధించేంత వరకు భూమిపై శాంతి నెలకొనదు." అని న్యాయమూర్తి అన్నారు.

కాగా ఈ కేసు 18 జూలై, 2020కి సంబంధించినది. గుజరాత్‌లోని తాపి, బనస్కాంత జిల్లాల్లోని గ్రామాల మధ్య ఉన్న ఓ జంక్షన్ లో తెల్లవారుజామున 5.30 గంటలకు 16 ఆవులు, ఎద్దులను తీసుకువెళుతున్న ట్రక్కుతో సహా , ఆ ట్రక్కును తీసుకెళ్తున్న అమీన్ అనే వ్యక్తిని పట్టుకున్న‌ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

నిందితుడు అమీన్ ఆవులను వధ కోసం రవాణా చేస్తున్నాడని భావించిన కోర్టు అతనికి గుజరాత్ జంతు సంరక్షణ (సవరణ) చట్టంలోని సెక్షన్ 8(2) కింద జీవిత ఖైదు,రూ. 5 లక్షల జరిమానా విధించబడింది.

First Published:  23 Jan 2023 9:57 AM GMT
Next Story