Telugu Global
National

మాయమైన 'వరాహ రూపం'.. 'కాంతార'కు దిక్కెవరు..?

కోజికోడ్ జిల్లా సెషన్స్‌ కోర్టు కాంతార యూనిట్‌ కి పెద్ద షాకిచ్చింది. ఇకపై వరాహరూపం పాటని సినిమాలో ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్‌ తో పాటు ఇతర మ్యూజిక్‌ యాప్స్ లో కూడా ఈ పాటని తొలగించాలని ఆదేశించింది.

మాయమైన వరాహ రూపం.. కాంతారకు దిక్కెవరు..?
X

'కాంతార' సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే, క్లైమాక్స్ లో వచ్చే 'వరాహ రూపం' పాట మరో ఎత్తు. ఆ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది ఆ పాట. అయితే ఇప్పుడా పాటను సినిమానుంచి తొలగించబోతున్నారు. న్యాయపరమైన వివాదాలకు 'కాంతార' టీమ్ తలొగ్గక తప్పలేదు. కాపీ ఆరోపణలతో ఆ పాటను సినిమా నుంచి తొలగించేందుకు చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ మరో ఆప్షన్ కూడా ఉంది. న్యాయస్థానం మెట్లెక్కిన మ్యూజిక్ బ్యాండ్ తో సినిమా నిర్మాతలు సెటిల్మెంట్ కు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.

ఏంటీ గొడవ..?

'కాంతార' సినిమాలో కర్నాటకలోని భూతకోల అనే ఓ నృత్యరూపాన్ని హైలెట్ గా చూపించారు. భూతకోల ఆడే నృత్యకారుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. భూతకోల ఆడే సమయంలో వరాహ రూపం అంటూ పాట వస్తుంది. అయితే ఈ పాట ఒరిజినల్ ట్యూన్ తమదేనంటూ కేరళకు చెందిన 'తైక్కుడం బ్రిడ్జ్' అనే మ్యూజిక్ బ్యాండ్ వారు ఆరోపించారు. అంతే కాదు న్యాయపోరాటం మొదలు పెట్టారు. తమ అనుమతి లేకుండా ఆ పాటని సినిమాలో పెట్టారంటూ కోర్టుకెక్కారు. విచారణ జరిపిన కోజికోడ్ జిల్లా సెషన్స్‌ కోర్టు, కాంతార యూనిట్‌ కి పెద్ద షాకిచ్చింది. ఇకపై వరాహరూపం పాటని సినిమాలో ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్‌ తో పాటు ఇతర మ్యూజిక్‌ యాప్స్ లో కూడా ఈ పాటని తొలగించాలని ఆదేశించింది. దీంతో థియేటర్ల ప్రింట్ నుంచి ఈ పాటను తొలగించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారని సమాచారం.

వరాహ రూపంలేని కాంతార చూడగలమా.. ?

వాస్తవానికి ఈ సినిమాకి వరాహ రూపం పాట ఆయువు పట్టు. ఆ పాటలేని సినిమాని ఊహించలేం. అందుకే నిర్మాతలు మరో ప్రయత్నం కూడా మొదలు పెట్టారని తెలుస్తోంది. ఈ పాటకోసం కోర్టు మెట్లెక్కిన మ్యూజిక్ బ్యాండ్ తో సయోధ్యకుదుర్చుకోవాలని అనుకుంటున్నారట. అది కుదరకపోతే వరాహరూపం స్థానంలో ఆ స్థాయికి తగ్గట్టే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని నడిపిస్తూ మరో పాట పెడతారట. ఈ రెండిట్లో ఏది జరుగుతుందో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

First Published:  29 Oct 2022 2:54 PM GMT
Next Story