Telugu Global
National

అవినీతి చూడలేం.. ఓటు మాత్రం వారికే వేస్తాం..

2020లో బీహార్, 2022లో గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు పాత పార్టీలకే పట్టం కట్టారు. అవినీతిపై ఆరోపణలు వినిపించినా కూడా ప్రజలు అధికార మార్పు కోరుకోలేదని తేటతెల్లమైంది. 2018లో కర్నాటక, 2022లో గుజరాత్ ఎన్నికల ఫలితాలు కూడా విశ్లేషకుల అంచనాలకు అందలేదు.

అవినీతి చూడలేం.. ఓటు మాత్రం వారికే వేస్తాం..
X

ఫలానా రాష్ట్రంలో అవినీతి దారుణంగా పెరిగిపోయిందంటూ వార్తలొస్తుంటాయి. అక్కడ ఎవర్ని అడిగినా ప్రభుత్వ అవినీతి గురించి కథలు కథలుగా చెబుతుంటారు. కట్ చేస్తే ఆ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలొస్తే తిరిగి అదే పార్టీని ఎన్నుకుంటారు ఓటర్లు. ఎందుకిలా..? అవినీతిని చూడలేమంటూ చెప్పే ఓటర్లు.. తిరిగి అదే పార్టీకి ఎందుకు ఓట్లు వేస్తున్నారు. భారత్ లో ఓటరు నాడి పసిగెట్టేది ఎవరు..? అసలు నాయకుల్లో ఏం చూసి ఓటర్లు వారిని ఎన్నుకుంటున్నారు..?

సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్.. (CSDS) ఆధ్వర్యంలో 'లోక్ నీతి ప్రోగ్రామ్' లో భాగంగా ఇటీవల ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఓటర్ల నాడి పసిగట్టడం అసంభవం అని తేలింది. ప్రజలంతా రాష్ట్రంలో జరిగే అవినీతిపై ఆగ్రహంతో ఉంటారు, ఆయా పార్టీలపై రగిలిపోతుంటారు, కానీ పోలింగ్ రోజు మాత్రం వారికి ఇవేవీ గుర్తుకు రావు, ఇతరత్రా కారణాలు ఓటరుని డామినేట్ చేస్తాయి. ఫలితాలపై అవినీతికంటే అవే ఎక్కువ ప్రభావం చూపుతాయి.

12 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సరళిని CSDS పరిశీలించి ఓ నివేదిక తయారు చేసింది. ఇందులో ఒక్క తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో ప్రజలు అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, ప్రక్షాళణ చేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. కానీ ఆ 12 రాష్ట్రాల్లో ఆరుచోట్ల అవే పార్టీలు తిరిగి అధికారంలోకి వచ్చాయి. అంటే ఓటర్లు అవినీతికంటే ఎక్కువగా మరేదో స్థానిక విషయాలకు ప్రభావితం అవుతున్నారు.

2022లో పంజాబ్ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందన్న ప్రజలు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం అప్పగించారు. 2018లో మధ్యప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కూడా అధికారం చేతులు మారింది. 2020లో బీహార్, 2022లో గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు పాత పార్టీలకే పట్టం కట్టారు. అవినీతిపై ఆరోపణలు వినిపించినా కూడా ప్రజలు అధికార మార్పు కోరుకోలేదని తేటతెల్లమైంది. 2018లో కర్నాటక, 2022లో గుజరాత్ ఎన్నికల ఫలితాలు కూడా విశ్లేషకుల అంచనాలకు అందలేదు. తమ రాష్ట్రాలో అవినీతి రాజ్యమేలుతుందంటూ 50శాతం కంటే ఎక్కువమంది ప్రజలు అభిప్రాయ పడ్డారు. కానీ తిరిగి వారినే ఎన్నుకున్నారు. ఒక్క తెలంగాణలో మాత్రం అవినీతిపై ఎలాంటి కంప్లయింట్ లు లేవు, 2018లో తిరిగి బీఆర్ఎస్ కే ప్రజలు భారీ మెజార్టీతో పట్టం కట్టారు.

అవినీతిపై పోరాటం వృథా..

రాగాపోగా తేలేదేంటంటే.. అధికార పార్టీ అవినీతికి పాల్పడుతోంది, మంత్రులు, ఎమ్మెల్యేలంతా కోట్లు వెనకేసుకుంటున్నారు, అవినీతిపరులుగా మారిపోయారు అంటూ ప్రతిపక్షాలు పోరు పెట్టినా.. జనం కేవలం విని ఊరుకుంటున్నారు. జనం కూడా అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడినా పోలింగ్ రోజు మాత్రం దాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు. అవినీతి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అభివృద్ధి.. ఈ నాలుగు విషయాలపై ఓటర్ల అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. అయితే అవినీతి అనేది ఎప్పటికీ ప్రధాన కారణం కాబోదని మాత్రం తేలిపోయింది.

First Published:  30 March 2023 8:09 AM GMT
Next Story