Telugu Global
National

టీనేజర్లకు కొవిడ్ టీకాల్లేవు.. చేతులెత్తేసిన కేంద్రం

ఒక్క ముంబైలోనే 4 లక్షలమంది కౌమార వయసు బాల బాలికలు వ్యాక్సిన్ తీసుకోలేదు. బూస్టర్ డోసులు కూడా నిండుకున్నాయి.

టీనేజర్లకు కొవిడ్ టీకాల్లేవు.. చేతులెత్తేసిన కేంద్రం
X

కొవిడ్ టీకాల పంపిణీలో ప్రపంచంలోనే భారత్ నెంబర్-1 స్థానంలో ఉందని గొప్పలు చెప్పుకుంది కేంద్రం. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గేసరికి టీకాల గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోవడంలేదు. పైగా వయోజనుల్లో దాదాపుగా అందరూ టీకాలు రెండు డోసులు తీసుకున్నారు, కొంతమంది బూస్టర్ డోస్ కూడా వేయించుకున్నారు. అయితే 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారికి ఇప్పుడు టీకాల పంపిణీ సమస్యగా మారింది. వారికోసం ప్రభుత్వం కార్బెవాక్స్ టీకాని అందుబాటులోకి తెచ్చింది. కానీ కాలక్రమంలో వాటి పంపిణీ ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఇప్పుడు కార్బెవాక్స్ టీకా తొలిడోసు పూర్తయింది కానీ, రెండోడోసు ఎవరికీ అందలేదు.

ముంబైలో కార్బెవాక్స్ సెకండ్ డోస్ టీకాలు అందుబాటులో లేవు, తొలిడోసు వేయించుకున్న చాలామంది పిల్లలు, రెండో డోసు కోసం సమయం మించిపోయినా వేచి చూస్తున్నారు. టీకాకు టీకాకు మధ్య గ్యాప్ ఉండాలికానీ, అసలు రెండో డోసు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. దీంతో టీకాలు దొరకలేదని ఆ పిల్లల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు.

ప్రైవేటుగా కార్బెవాక్స్ టీకా తీసుకుందామన్నా అది అందుబాటులో లేదు. కౌమార దశలో ఉన్నవారికోసం ప్రభుత్వమే కార్బెవాక్స్ ని పంపిణీ చేస్తోంది. టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ సెంటర్ దీన్ని తయారు చేసింది. ఈ వ్యాక్సిన్ దిగుమతి చేసుకున్న కేంద్రం 12 నుంచి 15 ఏళ్ల వయసున్నవారికి ఉచితంగా ఇస్తోంది. ఫస్ట్ డోస్ వరకు హడావిడి చేసినా తర్వాత దిగుమతులు ఆగిపోయాయి. దీంతో ఇప్పుడు వారికి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఒక్క ముంబైలోనే 4 లక్షలమంది కౌమార వయసు బాల బాలికలు వ్యాక్సిన్ తీసుకోలేదు. బూస్టర్ డోసులు కూడా నిండుకున్నాయి. అసలు కొవిడ్ టీకాలు లేకుండానే టీకా సెంటర్లు నామ మాత్రంగా కనిపిస్తున్నాయి.

First Published:  7 Dec 2022 5:43 AM GMT
Next Story