Telugu Global
National

సంతానం కోసం ఖైదీకి పెరోల్‌.. - ఢిల్లీ హైకోర్టు తీర్పు

ప్రస్తుత కేసులోని పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత ఖైదీకి తన వంశాన్ని నిలుపుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పులో వివరించారు.

సంతానం కోసం ఖైదీకి పెరోల్‌.. - ఢిల్లీ హైకోర్టు తీర్పు
X

సంతానాన్ని పొందడం కోసం ఓ జీవిత ఖైదీకి నాలుగు వారాల పెరోల్‌ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. అతని భార్య అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని ఈ తీర్పు వెలువరించినట్టు తెలిపింది. భార్య వయసు 38 ఏళ్లు, భర్త వయసు 41 ఏళ్లు ఉన్న నేపథ్యంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న భర్త శిక్షాకాలం పూర్తయ్యాక ఆ దంపతులకు సంతానాన్ని పొందే వయసు మీరిపోతుందని, వయోభారం వారి ఉమ్మడి ఆకాంక్షకు అవరోధంగా మారుతుందని జస్టిస్‌ స్వర్ణకాంతశర్మ అభిప్రాయపడ్డారు. తన భర్త ద్వారా సంతానాన్ని పొందాలన్న భార్య హక్కును ప్రభుత్వం అడ్డుకోలేదని స్పష్టం చేశారు.

ప్రస్తుత కేసులోని పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత ఖైదీకి తన వంశాన్ని నిలుపుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పులో వివరించారు. అతనికి దాంపత్య జీవనం కోసం అనుమతివ్వడం లేదని, వంశాన్ని నిలబెట్టుకోవాలన్న భార్య ఆకాంక్షను, హక్కును గౌరవిస్తున్నామని తెలిపారు. సదరు ఖైదీ ఇప్పటికే 14 ఏళ్లుగా జైలులో ఉన్న విషయాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. పెరోల్‌ కోసం రూ.20 వేలకు వ్యక్తిగత బాండును సమర్పించడంతో పాటు ఒకరి పూచీకత్తు ఇవ్వాలని ఈ తీర్పు సందర్భంగా న్యాయమూర్తి షరతు విధించారు.

First Published:  29 Dec 2023 6:11 AM GMT
Next Story