Telugu Global
National

కండ‌క్ట‌ర్ రూపాయి చిల్ల‌ర ఇవ్వ‌లేద‌ని.. మూడున్న‌రేళ్లుగా న్యాయ‌పోరాటం

కండ‌క్ట‌ర్ వ్య‌వ‌హరించిన తీరుతో త‌న‌కు ప‌రువు న‌ష్టం క‌లిగిందంటూ వినియోగ‌దారుల కోర్టును ఆశ్ర‌యించాడు. త‌న‌కు రూ.15 వేలు ప‌రిహారంగా ఇప్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేశాడు.

కండ‌క్ట‌ర్ రూపాయి చిల్ల‌ర ఇవ్వ‌లేద‌ని.. మూడున్న‌రేళ్లుగా న్యాయ‌పోరాటం
X

బ‌స్సు కండ‌క్ట‌ర్ రూపాయి చిల్ల‌ర ఇవ్వ‌లేద‌ని.. కోర్టుకెక్కాడో ప్ర‌యాణికుడు. కండ‌క్ట‌ర్ వ్య‌వ‌హ‌రించిన తీరుతో త‌న ప‌రువుకు భంగం క‌లిగింద‌ని పేర్కొంటూ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించాడు. త‌న‌కు ప‌రువు న‌ష్టం జ‌రిగింద‌ని, ప‌రిహారంగా రూ.15 వేలు ఇప్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేశాడు. 2019 సెప్టెంబ‌ర్‌లో కోర్టును ఆశ్ర‌యించ‌గా, తాజాగా న్యాయ‌స్థానం దీనిపై తీర్పు వెలువ‌రించింది.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల్లోకెళితే.. 2019 సెప్టెంబ‌రులో ర‌మేష్ నాయ‌క్ అనే ప్ర‌యాణికుడు.. బెంగ‌ళూరులోని శాంతిన‌గ‌ర నుంచి మెజిస్టిక్ వ‌ర‌కు బీఎంటీసీ వోల్వో బ‌స్సులో ప్ర‌యాణించాడు. టిక్కెట్ ధ‌ర రూ.29 కాగా, రూ.30 కండ‌క్ట‌ర్‌కి ఇచ్చాడు. చిల్ల‌ర రూపాయి త‌న‌కు రావాల్సి ఉంటుంద‌ని కండ‌క్ట‌ర్‌ని అడ‌గ‌గా, అత‌ను చిల్ల‌ర లేద‌ని స‌మాధాన‌మిచ్చాడు. బ‌స్సు దిగే స‌మ‌యంలోనూ రూపాయి కోసం ఆరా తీయ‌గా.. కండ‌క్ట‌ర్ మ‌ళ్లీ లేద‌ని చెప్పాడు.

ఈ సంద‌ర్భంగా వారిద్ద‌రి మ‌ధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ వ్య‌వ‌హారం అంత‌టినీ త‌న సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన స‌ద‌రు ర‌మేష్ నాయ‌క్‌.. కండ‌క్ట‌ర్ వ్య‌వ‌హరించిన తీరుతో త‌న‌కు ప‌రువు న‌ష్టం క‌లిగిందంటూ వినియోగ‌దారుల కోర్టును ఆశ్ర‌యించాడు. త‌న‌కు రూ.15 వేలు ప‌రిహారంగా ఇప్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేశాడు.

ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం వివాదం రూపాయి కోస‌మే జ‌రిగినా.. ఈ విష‌యంలో కండ‌క్ట‌ర్‌గా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని భావించి.. వినియోగ‌దారునికి రూ.3 వేల ప‌రిహారాన్ని అందించాల‌ని, న్యాయ పోరాటానికి అయిన ఖ‌ర్చుల‌నూ అత‌నికి చెల్లించాల‌ని బీఎంటీసీ (బెంగ‌ళూరు మెట్రోపాలిట‌న్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేష‌న్‌)ని ఆదేశించింది.

First Published:  24 Feb 2023 7:33 AM GMT
Next Story