Telugu Global
National

మోదీ హత్యకు కుట్ర... ఇద్దరి అరెస్ట్

భారత ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేయడానికి కుట్ర చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్టు బీహార్ పోలీసులు ప్రకటించారు.

మోదీ హత్యకు కుట్ర... ఇద్దరి అరెస్ట్
X

భారత ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేయడానికి కుట్ర చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్టు బీహార్ పోలీసులు ప్రకటించారు. మోదీని హత్యచేయడానికి, భారత్‌ను విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతానికి చెందిన మొహమ్మద్ జలాలుద్దీన్, అథర్ పర్వేజ్ అనే ఇద్దరిని బీహార్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

పాట్నా, ఫుల్వారీ షరీఫ్ ASP మనీష్ కుమార్ కథనం ప్రకారం...జలాలుద్దీన్ జార్ఖండ్ రిటైర్డ్ పోలీసు అధికారి; అథర్ పర్వేజ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI)లో సభ్యుడు.

వీరి దగ్గర 'ఇండియా విజన్ 2047' పేరుతో ఓ పత్రం లభించిందని, అ‍ందులో ''మొత్తం ముస్లిం జనాభాలో 10 శాతం మంది తమ వెనుక ర్యాలీ అయినా, మెజారిటీ కమ్యూనిటీని లొంగదీసుకుని ఇస్లాం రాజ్యాన్ని స్థాపించవచ్చు''అని ఉందని మనీష్ కుమార్ చెప్పారు.

గత రెండు నెలలుగా ఈ ఇద్దరు నిందితుల వద్దకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వస్తున్నారని.. వచ్చే వారు టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు, హోటళ్లలో బస చేసేప్పుడు పేర్లు మార్చుకుంటున్నారని తెలిపారు.

పర్వేజ్ లక్షల్లో నిధులు సమీకరించినట్లు మనీష్ కుమార్ తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ పేరుతో స్థానికులకు కత్తులు ఉపయోగించడం నేర్పించారని, ఇతరులను మత హింసకు ప్రేరేపించారని ఆయన అన్నారు.

"జూలై 6-7 తేదీల్లో మార్షల్ ఆర్ట్స్ పేరుతో స్థానికులకు కత్తులు ఉపయోగించడం నేర్పించారు. వారు మత హింస వైపు ఇతరులను ప్రేరేపించారు. మా వద్ద సీసీటీవీ ఫుటేజీతోపాటు సాక్షులు కూడా ఉన్నారు. పర్వేజ్ లక్షల్లో నిధులు సేకరించాడు, ED ఆ విచారణ ప్రారంభించింది. "అని కుమార్ చెప్పారు.

కాగా నిందితుల బంధువుల వాదన మరోలా ఉంది. ప్రధాని మోదీ పాట్నా నుంచి బయలుదేరిన తర్వాత సోమవారం మధ్యాహ్నం 1 గంటకు జలాలుద్దీన్‌ విడుదలయ్యారు. అయితే, అతడిని నిన్న రాత్రి 7 గంటలకు మళ్లీ పిలిచి అదుపులోకి తీసుకున్నట్లు అథర్ తమ్ముడు ఖైజర్ పర్వేజ్ తెలిపారు.

వాస్తవానికి, జలాలుద్దీన్ ఫుల్వారీ షరీఫ్ లోని తన ఇల్లును సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(SDPI) కు అద్దెకు ఇచ్చాడు, అయితే పోలీసులు అతన్ని బలిపశువుగా చేసి కథను వండుతున్నారని ఆయన అన్నారు.

ASP మనీష్ కుమార్ రుజువుగా సమర్పించిన 'ఇండియా విజన్ 2047' పత్రాన్ని మే 2022లో మాజీ మైనారిటీ మంత్రి కె. రెహమాన్ ఖాన్ బెంగళూరులో విడుదల చేశారు. అది ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉంది అని ఖైజర్ పర్వేజ్ చెప్పారు.

First Published:  14 July 2022 6:52 AM GMT
Next Story