Telugu Global
National

పెళ్లి వాగ్దానం నెర‌వేర్చ‌లేకపోయినంత మాత్రాన‌.. అత్యాచారంగా ప‌రిగ‌ణించ‌లేం.. - ఒడిశా హైకోర్టు

త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని వాగ్దానం చేసి శారీర‌క సంబంధం కొనసాగించాడని, ఆ తర్వాత వివాహం చేసుకోకుండా మోసం చేశాడని స‌ద‌రు మ‌హిళ అత‌నిపై కేసు వేసింది.

పెళ్లి వాగ్దానం నెర‌వేర్చ‌లేకపోయినంత మాత్రాన‌.. అత్యాచారంగా ప‌రిగ‌ణించ‌లేం.. - ఒడిశా హైకోర్టు
X

పెళ్లి చేసుకుంటాన‌నే వాగ్దానం నెర‌వేర్చ‌లేక‌పోయినంత మాత్రాన.. ప‌ర‌స్ప‌ర స‌మ్మ‌తితో శృంగార సంబంధం కొన‌సాగించిన విష‌యంలో పురుషుడు అత్యాచారం చేసిన‌ట్టు ప‌రిగ‌ణించ‌లేమ‌ని ఒడిశా హైకోర్టు తెలిపింది. ఓ కేసులో న‌మోదైన అభియోగాల‌ను ఈనెల 3న కొట్టివేస్తూ న్యాయ‌స్థానం ఈ వ్యాఖ్య‌లు చేసింది. ఆ కేసులోని వివ‌రాలు ఇలా ఉన్నాయి.

భువ‌నేశ్వ‌ర్‌కు చెందిన వ్య‌క్తికి ఓ మ‌హిళ‌తో స్నేహం ఉంది. ఆమె త‌న భ‌ర్త‌తో విభేదాల కార‌ణంగా ఐదేళ్లుగా ఒంట‌రిగా ఉంటోంది. త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని వాగ్దానం చేసి శారీర‌క సంబంధం కొనసాగించాడని, ఆ తర్వాత వివాహం చేసుకోకుండా మోసం చేశాడని స‌ద‌రు మ‌హిళ అత‌నిపై కేసు వేసింది. ఈ వ్య‌వ‌హారంలో అత‌నిపై అత్యాచారం, మోసం త‌దిత‌ర అభియోగాలు న‌మోద‌య్యాయి. వాటిని స‌వాల్ చేస్తూ అత‌ను హైకోర్టును ఆశ్ర‌యించాడు.

ఈ కేసు విచార‌ణ జ‌రిపిన జస్టిస్ ఆర్.కె. పట్నాయక్ ధర్మాసనం స్పందిస్తూ.. పెళ్లి చేసుకుంటానని సదుద్దేశంతో వాగ్దానం చేసి ఆ తర్వాత దాన్ని నెరవేర్చలేకపోవటానికి, మోసం చేసే ఉద్దేశంతోనే హామీ ఇవ్వడానికి సూక్ష్మమైన వ్యత్యాసం ఉందని తెలిపారు. మొదటి సందర్భంలో కొనసాగించిన శారీరక సంబంధాన్ని సెక్షన్ 376 కింద అత్యాచారంగా పరిగణించలేమ‌ని చెప్పారు. ఆదిలోనే మోసపూరిత హామీ చేసి రెండో సందర్భంలో మాత్రం శృంగార సంబంధం కొనసాగించడమే ఉద్దేశం కనుక అత్యాచార అభియోగాలను మోపవచ్చని వివరించింది. స్త్రీ, పురుషుల మధ్య స్నేహంతో మొదలైన బంధం క్రమంగా బలపడి, ఆ తర్వాత విభేదాలు వస్తే, దాన్ని ఎప్పుడూ అపనమ్మకం కోణంలో చూడకూడదని, పురుషుడిని అత్యాచార నిందితుడిగా ఆరోపించకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్ పై అత్యాచార అభియోగాలను కొట్టివేసినప్పటికీ, మోసం కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.

First Published:  8 July 2023 3:24 AM GMT
Next Story