Telugu Global
National

జోడు ప‌ద‌వుల పాల‌సీ పై కాంగ్రెస్ యూ టర్న్?

సోనియా గాంధీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ "వ్యూహాత్మక బృందం" తో సమావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశానికి రాజ్యసభ నుంచి ఖర్గే, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్‌లను మాత్రమే పిలిచినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ అధ్యక్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే
X

కాంగ్రెస్ అధ్యక్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే

కాంగ్రెస్ పార్టీలో ఒక‌ వ్య‌క్తి- ఒకే ప‌ద‌వి అనే అంశం మ‌ళ్ళీ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జోడు ప‌ద‌వుల‌కు వ్య‌తిరేకంగా తీర్మానించిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు త‌న విధానం నుంచి యు-ట‌ర్న్ తీసుకుందా అనే సందేహాలు క‌లుగుతున్నాయి. ఎగువ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే స్థానంలో ఎవ‌రిని నియ‌మించాలో పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయ‌నే పార్టీ నేత‌గా రాజ్య‌స‌భ‌లో కొన‌సాగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని సంబంధిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఖర్గే రెండు పదవులలోనూ కొన‌సాగితే పార్టీ అగ్రనాయ‌కుడు రాహుల్ గాంధీ ప‌ట్టుబ‌ట్టిన "ఒక వ్యక్తి, ఒక పోస్ట్" విధానానికి పూర్తిగా విరుద్ధం అవుతుంది. ఈ అంశ‌మే అశోక్ గెహ్లాట్ అధ్య‌క్ష ప‌ద‌వి పోటీ నుంచి విర‌మించుకోవాల్సి వ‌చ్చింది.

సోనియా గాంధీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ "వ్యూహాత్మక బృందం" తో సమావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశానికి రాజ్యసభ నుంచి ఖర్గే, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్‌లను మాత్రమే పిలిచినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖ‌ర్గే అధ్య‌క్షుడ‌య్యాక రాజ్య‌స‌భ‌లో ఆయ‌న స్థానంలో విప‌క్ష నేత‌గా దిగ్విజయ్ సింగ్ పేరు గ‌ట్టిగా వినిపించింది. అయితే రేసులో ముందున్న ఆయ‌న్ను కానీ, మ‌రో సీనియ‌ర్ నేత పి చిదంబరంలను కానీ ఈ సమావేశానికి ఆహ్వానించలేదని ఆ వర్గాలు చెప్పాయి.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మొద‌ట రాజ‌స్తాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ ను పోటీలో దించాల‌ని గాంధీ కుటుంబీకులు భావించారు. అయితే ఒక‌వ్య‌క్తికి ఒకే ప‌ద‌వి అంటూ పార్టీ చేసిన తీర్మానానికి క‌ట్టుబ‌డి ఉండాల్సిందేన‌ని రాహుల్ గాంధీ ప‌ట్టుబ‌ట్ట‌డంతో గెహ్లాట్ సీఎం ప‌ద‌విని వ‌దులుకోడానికి ఇష్ట‌ప‌డ‌లేదు. గెహ్లాట్ అద్య‌క్ష బాద్య‌త‌లు చేప‌డితే ఆయ‌న స్థానంలో స‌చిన్ పైల‌ట్ ను ముఖ్య‌మంత్రిగా చేయాల‌ని అధిష్టానం భావించింది. అయితే ఇదే స‌మ‌యంలో గెహ్లాట్ స్థానంలో పైల‌ట్ ను నియ‌మించాల‌న్న ఆలోచ‌న‌ను గెహ్లాట్ వ‌ర్గం ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్య‌తిరేకించిన విష‌యం తెలిసిందే. దీంతో అధిష్టానం ఖ‌ర్గేను పోటీలో దించాల్సి వ‌చ్చింది. ఆయ‌న పార్టీ ఎన్నిక‌ల బ‌రిలో దిగే ముందు రాజ్య‌స‌భ‌లో విప‌క్ష నేత ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ ఖాళీని ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రితోనూ పార్టీ భ‌ర్తీ చేయ‌లేదు. కాగా పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు ముగిసే వ‌ర‌కూ ఖ‌ర్గేనే విప‌క్ష నేత‌గా కొన‌సాగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

First Published:  2 Dec 2022 11:43 AM GMT
Next Story