Telugu Global
National

పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న సిద్ధరామయ్య

తమ నేతకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. దీంతో స‌హ‌నం కోల్పోయిన‌ సిద్ధరామయ్య ఆగ్ర‌హంతో ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు.

పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న సిద్ధరామయ్య
X

కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సొంత పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. తమ నేతకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కొందరు కార్యకర్తలు చుట్టుముట్టగా సహనం కోల్పోయిన సిద్ధరామయ్య ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం శాయశక్తులా కృషిచేస్తోంది. గెలుపు గుర్రాల కోసం పార్టీ అధిష్టానం అన్వేషిస్తోంది.

ఈ క్రమంలో ఆశావహులు టికెట్ కోసం పార్టీ అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణ‌లు చేస్తున్నారు. ఈసారి టికెట్ రావడం అనుమానమేనని భావిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు మద్దతుదారులతో కలిసి నిరసన తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా హరిహర్ ఎమ్మెల్యే రామప్ప మద్దతుదారులు శుక్రవారం ఉదయం సిద్ధరామయ్య నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమ నాయకుడికి మరోమారు టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు.

ఆ సమయంలో సిద్ధరామయ్య తన నివాసం నుంచి బయటకు వచ్చారు. దీంతో వెంటనే రామప్ప అనుచరులు సిద్ధరామయ్యను చుట్టుముట్టారు. తమ నేతకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది. దీంతో స‌హ‌నం కోల్పోయిన‌ సిద్ధరామయ్య ఆగ్ర‌హంతో ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారు. అయితే కార్యకర్తపై సిద్ధరామయ్య చేయి చేసుకుంటుండగా కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది ప్రస్తుతం వైరల్‌గా మారింది.

First Published:  24 March 2023 2:53 PM GMT
Next Story