Telugu Global
National

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు: వాళ్ళిద్దరి మధ్యనే పోటీ

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్ ల మధ్య పోటీ ఖాయమైంది. అనేక పేర్లు తెరమీదికి వచ్చినప్పటికీ చివరకు పోటీలో వీళ్ళిద్దరే మిగిలారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు: వాళ్ళిద్దరి మధ్యనే పోటీ
X

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు అనేక మలుపులతో, ట్విస్టులతో రక్తి కట్టిస్తున్నాయి. పోటీ చేస్తానని ముందుగానే ప్రకటించి, ఇప్పటికీ పోటీలో ఉన్న శశిథరూర్ తప్ప, ఇప్పటి వరకు ఇంకెవ్వరి అభ్యర్థిత్వం స్థిరంగా లేదు. అనేక పేర్లు తెరపైకి రావడం, మళ్ళి తెరమరుగు కావడం జరుగుతూ వస్తూ వుంది. మొదటి నుంచీ అధిష్టానానికి ప్రియమైన అభ్యర్థిగా ప్రచారం జరిగిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్ ఇచ్చిన ట్విస్టుతో అధిష్టానం అయోమయంలోకి వెళ్ళిపోయింది. రాజస్థాన్ లో అశోక్ గెహ్లెట్ అనుచరులైన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో అధిష్టాన తల బొప్పికట్టింది. చివరకు ఆయనను పక్కన పెట్టి మరో అభ్యర్థి కోసం వెతుకులాట ప్రారంభించింది.

ఒక వైపు తాను, తన కుటుంబం ఎవరికీ మద్దతు ఇవ్వబోమని చెప్తూనే తన చెప్పుచేతుల్లో ఉండే అభ్యర్థిని రంగంలోకి దించేందుకు సోనియా ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో అనేక పేర్లు ముందుకు వచ్చాయి. దిగ్విజయ్ సింగ్, అజ‌య్ మాకెన్‌, ముకుల్ వాస్నిక్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. చివరకు అధిష్టానం మల్లికార్జున్ ఖర్గేను అభ్యర్థిగా నిర్ణయించింది. దాంతో మిగతా పేర్లన్నీ తెరవెనకకు వెళ్ళిపోయాయి. ఖర్గే లాంటి సీనియర్ నిలబడుతున్నందున తాను ఉపసంహరించుకుంటున్నట్టు దిగ్విజయ్ ప్రకటించారు.

కాగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి ఖర్గే కొద్ది సేపటి క్రితం ఏఐసీసీ కార్యాలయం నుంచి బయలుదేరారు. దాంతో రంగంలో ఖర్గే, థరూర్ లు మాత్రమే ఉండబోతున్నారనేది స్పష్టమైంది. ఇద్దరు కూడా దక్షిణాదికి చెందినవారే కావడం విశేషం. ఖర్గే కర్నాటక‌కు చెందినవారు కాగా శశి థరూర్ కేరళ. ఇక జీ23 గ్రూపు ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇంకా తేల్చలేదు. ఏదేమైనా గాంధీ కుటుంబ మద్దతు ఉన్న మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ కు అధ్యక్షులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. .

First Published:  30 Sep 2022 8:28 AM GMT
Next Story