Telugu Global
National

కాంగ్రెస్ కావాలనే గులాం నబీని పక్కన పెట్టిందా?

కాంగ్రెస్ అధిష్టానం ఒక వ్యూహంతోనే ఆజాద్‌ను సైడ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఆజాద్.. పార్టీ వ్యతిరేక గళం వినిపిస్తున్నారు.

కాంగ్రెస్ కావాలనే గులాం నబీని పక్కన పెట్టిందా?
X

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వ్యవహారం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ కోర్ గ్రూప్ జీ23లో కీలక సభ్యుడైన ఆజాద్‌ను ఒక ప్రాంతానికే పరిమితం చేయడం.. ఆయన మరో పదవికి రాజీనామా చేయడంతో ఈ వివాదం రాజుకుంది. కాంగ్రెస్ పార్టీకి కీలక సమయంలో పని చేసిన ప్రణబ్ ముఖర్జీ,అహ్మద్ పటేల్ వంటి నేతల నిష్క్రమణ తర్వాత జాతీయ స్థాయిలో గులాం నబీ ఆజాద్ వంటి నేతలు పార్టీ వ్యవహారాలను చక్కదిద్దారు. దక్షిణాది రాష్ట్రాలపైనే కాకుండా గుజరాత్, రాజస్థాన్, సొంత రాష్ట్రమైన జమ్ము కశ్మీర్ వ్యవహారాలను కూడా చూశారు. ప్రస్తుతం కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో గులాం నబీ ఆజాద్ మునుపటిలా అధిష్టానానికి అనుకూలంగా కాకుండా.. నిరసన గళం వినిపిస్తూ వస్తున్నారు.

జమ్ము, కశ్మీర్ రాష్ట్ర హోదా నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడ బీజేపీ సొంతగా ఎప్పుడూ గెలవలేదు. మొదటి నుంచి పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ వంటి పార్టీలే అధికారం చెలాయించాయి. జమ్ము-కశ్మీర్ మూడేళ్ల క్రితం రాష్ట్రం హోదా కోల్పోయి, అసెంబ్లీ రద్దయ్యే సమయానికి పీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఉండేది. అయితే మూడేళ్ల నుంచి రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ము, కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాలకు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం పార్టీ పునర్వవస్థీకరణ చేసింది.

పీసీసీ చీఫ్‌గా వికార్ వసూల్ వనీ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రమణ్ భల్లాను నియమించింది. పార్టీలోని కీలక పదవుల నుంచి ఆజాద్ వర్గాన్ని తప్పించింది. అంతే కాకుండా ఆ రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలను ఆజాద్‌కు అప్పగించింది. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో పార్టీ వ్యవహారాలు చూసిన ఆజాద్.. ఇప్పుడు రెండు కేంద్ర పాలిత ప్రాంతానికి పరిమితం చేయడం అవమానంగా భావించి.. రాజకీయ వ్యవహారాల కమిటీకి రాజీనామా చేశారు.

అయితే, కాంగ్రెస్ అధిష్టానం ఒక వ్యూహంతోనే ఆజాద్‌ను సైడ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఆజాద్.. పార్టీ వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. మరోవైపు కేంద్రంలోని అధికార బీజేపీ, మోడీపై అప్పుడప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. గత ఏడాది గులాం నబీ ఆజాద్ రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదా నుంచి రిటైర్ అవుతున్నప్పుడు ఏకంగా గులాం నబీని పొగుడుతూ మోడీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. 2006 గోద్రా సంఘటన నుంచి ఆజాద్ తనను ఎలా వెన్నంటి ఉన్నది వివరించారు. ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రుచించలేదు.

మరోవైపు ఆజాద్‌కు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీగా పొడిగింపు ఇవ్వలేదు. అదే సమయంలో బీజేపీ ఆజాద్‌కు ప్రభుత్వంలో కీలక పదవి ఇస్తుందనే ప్రచారం జరిగింది. రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతిని చేస్తారనే వార్తలు వచ్చాయి. ఆయన ఇటీవల కాలంలో మోడీ ప్రభుత్వంపై విమర్శలు తగ్గించి... వీలున్నప్పుడల్లా పొగడ్తలు కురిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కీలక నేత ఇలా వ్యవహరించడం సోనియా గాంధీకి కూడా నచ్చలేదు. దీంతో ఆయనను పొమ్మనకుండా పొగపెట్టేలా ఇలా పార్టీలో ప్రాధాన్యత తగ్గించినట్లు చర్చ జరుగుతోంది.

అయితే ఆజాద్ వ్యవహారంపై ఇతర సీనియర్ నేతలు, పార్టీ వర్గాలు ఇంకా ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కానీ పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తే మాత్రం ఎంతటి వారిపైన అయినా చర్యలు ఉంటాయనే సంకేతాలను మాత్రం అధిష్టానం ఇచ్చినట్లు అర్థం అవుతోంది.

First Published:  17 Aug 2022 3:46 AM GMT
Next Story