Telugu Global
National

జోడో యాత్రకు భయపడ్డారు.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్..

పాత ఆరోపణలనే మళ్లీ తిరగదోడి, హడావిడిగా ఇప్పుడు ట్రస్ట్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించారని ఇది రాజకీయ కక్షసాధింపేనని మండిపడ్డారు జైరాం రమేష్. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి రోజువారీ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.

జోడో యాత్రకు భయపడ్డారు.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్..
X

భారత్ జోడో యాత్రకు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక కేంద్రం డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టిందని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్. అందుకే రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌(RGF), రాజీవ్‌ గాంధీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌(RGCT)లపై చర్యలు తీసుకున్నారని మండిపడ్డారు. ఈ రెండు ట్రస్ట్ లకు విదేశీ విరాళాలు స్వీకరించే అర్హత లేదంటూ హోం శాఖ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. పాత ఆరోపణలనే మళ్లీ తిరగదోడి, హడావిడిగా ఇప్పుడు ట్రస్ట్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించారని ఇది రాజకీయ కక్షసాధింపేనని మండిపడ్డారు జైరాం రమేష్.

డైవర్షన్ గేమ్..

నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి రోజువారీ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. లాభాపేక్ష లేని ఆ రెండు సంస్థల కార్యకలాపాలు పూర్తిగా పారదర్శకంగా ఉన్నాయని, వాటి ద్వారా ప్రజాసేవ జరుగుతోందని, వాటికోసం కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేస్తుందని చెప్పారు. ఎన్ని కుతంత్రాలు చేసినా భారత్ జోడో యాత్రను అడ్డుకోలేరని అంటున్నారు.

2020లో నివేదిక.. రెండేళ్ల తర్వాత చర్యలు..

RGF, RGCT ట్రస్ట్ లకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై 2020లో హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ దర్యాప్తు చేసి నివేదిక సమర్పించింది. రెండేళ్ల క్రితం సమర్పించిన నివేదిక ఆధారంగా ఇప్పుడు కేంద్రం చర్యలు తీసుకుంది. భారత్ జోడో యాత్ర విషయంలో కేంద్రం ఆత్మరక్షణలో పడిందని, కావాలనే కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు ఆ పార్టీ నేతలు. ట్రస్ట్ లపై చర్యలు తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ పై నిందలు వేయాలని చూస్తున్నారని, ఆ ట్రస్ట్ ల ద్వారా ఎలాంటి అక్రమాలు జరగడంలేదని చెబుతున్నారు. న్యాయపోరాటం చేస్తామంటున్నారు.

First Published:  24 Oct 2022 3:04 AM GMT
Next Story