Telugu Global
National

అల‌క ఎందుకు ఆజాద్‌..?

అధిష్టానం చేసిన మార్పులు అనేక మందిలో అసంతృప్తి రగిలించాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని నియమించేటప్పుడు సీనియర్ నాయకులను సంప్రదించకపోవడం అసంతృప్తికి కారణం అయింది.

అల‌క ఎందుకు ఆజాద్‌..?
X

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి 2020 ఆగస్టులో లేఖ రాసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులలో ఒకరైన గులాం నబీ ఆజాద్ లో ఇంకా అసంతృప్తి గూడు కట్టుకునే ఉన్నట్టుంది. అసంతృప్తి వ్యక్తం చేసిన 23 మంది నాయకులతో సోనియా విడివిడిగా మాట్లాడారు. అయినా పరిస్థితి మారినట్టు లేదు.

బుధవారం గులాం నబీ ఆజాద్ ను జమ్మూ-కశ్మీర్ లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడిగా నియమించారు. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదన్న కారణంతో ఆ బాధ్యతలు చేపట్టడానికి ఆజాద్ నిరాకరించారు. 11 మందితో కూడిన ఎన్నికల ప్రచార కమిటీకి గులాం నబీని అధ్యక్షుడిగా, తారిఖ్ హమీద్ కర్రాను ఉపాధ్యక్షుడిగా నియమించారు. విచిత్రం ఏమిటంటే ఈ కమిటీలో నియమితులైన హాజీ అబ్దుల్ రషీద్, మహమ్మద్ అమీన్ భట్, గుల్జార్ అహమద్ వనీ కూడా ఈ కమిటీకి రాజీనామా చేశారు.

అయితే అంతకు ముందు ఆజాద్ కు సన్నిహితుడైన గులాం అహమద్ మీర్ ను జమ్మూ-కశ్మీర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష స్థానం నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తొలగించారు. ఆజాద్ అలకకు ఇదీ కారణం అయి ఉండొచ్చు. మీర్ స్థానంలో వికార్ రసూల్ వనీ జమ్మూ-కశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

జమ్మూ-కశ్మీర్ లో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ఖరారు కాలేదు. అయినా ఎన్నికలు జరగక తప్పదు కనుక రాజకీయ వ్యవహారాల కమిటీ, సమన్వయ కమిటీ, ఎన్నికల ప్రణాళిక కమిటీ, క్రమశిక్షణా కమిటీ కూడా కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. అధిష్టానం చేసిన మార్పులు అనేక మందిలో అసంతృప్తి రగిలించాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని నియమించేటప్పుడు సీనియర్ నాయకులను సంప్రదించకపోవడం అసంతృప్తికి కారణం అయింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హాజీ అబ్దుల్ రషీద్ అయితే కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికే రాజీనామా చేశారు.

First Published:  18 Aug 2022 6:10 AM GMT
Next Story