Telugu Global
National

మాస్టర్ చెఫ్ గడ్కరీ.. బ్యాడ్ చెఫ్ నిర్మల

కాంగ్రెస్ ఆర్థిక సంస్కరణలను హాఫ్ బేక్డ్ గా విమర్శించిన నిర్మలమ్మను బ్యాడ్ చెఫ్ అంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇక ఆనాటి సంస్కరణలను సరిగా అర్థం చేసుకున్న నితిన్ గడ్కరీని మాస్టర్ గా అభివర్ణించింది.

మాస్టర్ చెఫ్ గడ్కరీ.. బ్యాడ్ చెఫ్ నిర్మల
X

మాజీ ప్రధాని, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఆర్థిక రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. గడ్కరీని మాస్టర్ చెఫ్ (వంట బాగా చేయగల వ్యక్తి)గా ప్రశంసించింది. అదే సమయంలో నిర్మలమ్మకు వంటలు రావని ఎద్దేవా చేసింది. అసలు ఆర్థిక సంస్కరణలపై చేసిన కామెంట్లకు వంటలకు కారణం ఏంటని అనుకుంటున్నారా? అక్కడే కాంగ్రెస్ నేతలు తమ చమత్కారాన్ని బయటపెట్టారు. గతంలో మన్మోహన్ సింగ్ పై నిర్మలమ్మ చేసిన కామెంట్లకు ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు.

1991లో కాంగ్రెస్ హయాంలో వచ్చిన ఆర్థిక సంస్కరణలపై ఇటీవల నిర్మలా సీతారామన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అవి సగం వండినట్టు (హాఫ్ బేక్డ్)గా అసంపూర్తిగా ఉన్నాయని, అందువల్లే ఇప్పటికీ భారత్ లో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఆ నిందను కాంగ్రెస్ పై నెట్టివేశారు. కాంగ్రెస్ ఆర్థిక సంస్కరణలను హాఫ్ బేక్డ్ గా అభివర్ణించిన నిర్మలమ్మను బ్యాడ్ చెఫ్ అంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇక ఆనాటి సంస్కరణలను సరిగా అర్థం చేసుకున్న నితిన్ గడ్కరీని మాస్టర్ చెఫ్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది.

ఇప్పటికైనా అర్థం చేసుకోండి..

నితిన్ గడ్కరీ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ చెలరేగిపోతోంది. గతంలో తమపై విమర్శలు చేసినవారికి ఇవే సమాధానాలని చెబుతోంది. ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలమ్మ ఇటీవల పలు సందర్భాల్లో కాంగ్రెస్ పైనే నిందలేశారు. ప్రస్తుత అధ్వాన్న ఆర్థిక స్థితికి కూడా కారణం కాంగ్రెస్సేనంటూ ఆమె చెబుతుంటారు. మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో ఏం చేసిందో చెప్పలేకపోతున్నారు. పెద్దనోట్ల రద్దు, లాక్ డౌన్ వంటి నిర్ణయాలతో మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన సంగతిని ఆమె ఉద్దేశపూర్వకంగానే పక్కనపెడుతున్నారు. రూపాయి మారక విలువ పడిపోయినా, డీజిల్ రేటు పెరిగినా, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటినా అన్నిటికీ అలనాటి కాంగ్రెస్ పాలనే కారణం అనడం బీజేపీ నేతలకు అలవాటైపోయింది. ఇకనైనా ఇలాంటి చేతగాని మాటల్ని ఆపేయండి అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పాలనను గడ్కరీ సరిగా అర్థం చేసుకున్నారని, నిర్మలా సీతారామన్ వంటివారు హాఫ్ బేక్డ్ అంటూ వారి అసమర్థతను వారే బయటపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

First Published:  10 Nov 2022 1:25 AM GMT
Next Story