Telugu Global
National

భారీగా పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు - మోడీపై కాంగ్రెస్ ఫైర్

గత ప్రభుత్వంతో పోలిస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక 1.7 రెట్లు అధికంగా దేశ పౌరసత్వాన్ని భారతీయులు వదులుకొని విదేశాల్లోనే స్థిరపడుతున్నారు.

భారీగా పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు - మోడీపై కాంగ్రెస్ ఫైర్
X

నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక ఇండియా నుంచి భారీగా వలసలు పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా వివిధ రంగాల్లో నిపుణులైన వారు, ధనికులు భారతదేశాన్ని వదిలి వెళ్తున్నారు.

2014 నుంచి భారత పౌరసత్వాన్ని వదిలేసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. 2022లో రోజుకు 604 మంది చొప్పున భారతీయులు త‌మ‌ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు విదేశాంగ శాఖ తెలిపిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకు భారతీయులు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీగా దేశ పౌరసత్వాన్ని వదులుకొని వెళ్లిపోతున్నారో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ బీజేపీని ప్రశ్నించింది.

2014 ముందు దేశ పౌరసత్వాన్ని వదులుకొని వెళ్లే వారి సంఖ్య రోజుకు 354 మాత్రమే ఉండేది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆ శాతం అమాంతం పెరిగింది. గత ప్రభుత్వంతో పోలిస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక 1.7 రెట్లు అధికంగా దేశ పౌరసత్వాన్ని భారతీయులు వదులుకొని విదేశాల్లోనే స్థిరపడుతున్నారు.

నిరుద్యోగం, అవకాశాలు లేకపోవడం, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, జీఎస్టీ, నోట్ల రద్దు వంటి పరిణామాల కారణంగానే చాలామంది భారతదేశాన్ని వీడి వెళ్తున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇలా ఎక్కువగా భారతదేశాన్ని వదిలి వెళ్తున్న వారిలో ఐటీతో పాటు పలు రంగాలకు చెందిన నిపుణులు ఉండటం కూడా ఆందోళన కలిగించే అంశం.

ఉద్యోగం, వ్యాపారం రీత్యా విదేశాల్లో నివ‌సించేవారు ఎక్కువ శాతం దేశం బయటే స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు అన్నది గణాంకాలని బట్టి అర్థమవుతుంది. నిజంగానే దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్టు అచ్చే దిన్ వచ్చి ఉంటే భారతీయులు ఇలా ఎందుకు విదేశాలకు వలస వెళుతున్నారో చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ప్రశ్నించారు. భారతీయులు సొంత దేశాన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్లిపోవడమేనా ప్రధాని మోడీ చెబుతున్న అమృతకాలం అని నిలదీశారు.

First Published:  11 Jan 2023 3:18 AM GMT
Next Story