Telugu Global
National

కర్నాటకలో గృహలక్ష్మి.. ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రచారాస్త్రం

కర్నాటకలో కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం అయిన సందర్భంగా.. తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి నెలనెలా 2వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ప్రియాంక గాంధీ.

కర్నాటకలో గృహలక్ష్మి.. ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రచారాస్త్రం
X

కర్నాటక అసెంబ్లీకి మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అధికార బీజేపీకి ఈసారి గడ్డుపరిస్థితి ఎదురవుతుందనే అంచనాలున్నాయి. మరోవైపు జేడీఎస్, బీఆర్ఎస్ కూటమి కూడా మంచి ఊపుమీదుంది. అటు కాంగ్రెస్ కూడా సోలోగా అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తోంది. ఈసారి ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కాస్త గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. హామీల విషయంలో కూడా కాంగ్రెస్ దూసుకుపోతోంది. ‘నా నాయకి’ అనే కార్యక్రమం ద్వారా ప్రియాంక గాంధీ బహిరంగ సభలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు.

కర్నాటకలో కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం అయిన సందర్భంగా.. తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి నెలనెలా 2వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ప్రియాంక గాంధీ. కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి మహిళ ఖాతాలో ఈ ఆర్థిక సాయం జమచేస్తామన్నారామె. ఏడాదికి 24వేల రూపాయల ఆర్థిక సాయం అంటే.. కచ్చితంగా దానితో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఈ పథకానికి గృహలక్ష్మియోజన అనే పేరు పెట్టారు.

ఉచిత కరెంటు కూడా..

ప్రతి ఇంటికి ప్రతి నెలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ను అందజేస్తామని కాంగ్రెస్‌ ఇటీవలే ప్రకటించింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు గృహలక్ష్మి యోజన పథకాన్ని కూడా అనౌన్స్ చేశారు ప్రియాంక. పెరిగిన ధరలు, గ్యాస్ రేట్ల నుంచి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది కొంత ఉపశమనం కలిగిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా కోటిన్నర మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారామె. రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేస్తామని, బీజేపీ పాలిత రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. కాంట్రాక్ట్ పనుల్లో మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుందని అన్నారు. బెంగళూరులో రూ.8,000 కోట్లతో జరగాల్సిన అభివృద్ధి గురించి ఆలోచించాలని, కానీ అందులో రూ.3,200 కోట్లు కమీషన్‌ గా మారుతోందని ఆమె ఆరోపించారు.

First Published:  16 Jan 2023 4:04 PM GMT
Next Story