Telugu Global
National

నేను శూద్రుడిని.. నిర్మల బ్రాహ్మణవాది - లోక్‌సభలో రేవంత్ వ్యాఖ్యల దుమారం

తాను శూద్రకులం నుంచి వచ్చానని కాబట్టి తన హిందీ బలహీనంగానే ఉండవచ్చని.. నిర్మలా సీతారామన్ బ్రహ్మణవాది కాబట్టి ఆమె హిందీ అద్బుతంగా ఉండవచ్చని.. అంత మాత్రాన ఇతరుల భాషను ఎద్దేవా చేయవద్దని రేవంత్ కోరారు.

నేను శూద్రుడిని.. నిర్మల బ్రాహ్మణవాది - లోక్‌సభలో రేవంత్ వ్యాఖ్యల దుమారం
X

రూపాయి పతనంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మంత్రి వ్యాఖ్యలకు సభలోనే రేవంత్ రెడ్డి కూడా సమాధానం ఇచ్చారు. రూపాయి పతనంపై ప్రశ్న లేవనెత్తిన రేవంత్ రెడ్డి.. డాలర్‌తో రూపాయి విలువ 66 రూపాయలుగా ఉన్న సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీ.. రూపాయి ఐసీయూలో ఉందంటూ యూపీఏ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసిన అంశాన్ని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. మరి ఇప్పుడు రూపాయి విలువ ఏకంగా 83 రూపాయలకు పడిపోయి మార్చురీలోకి వెళ్తోందని ఎద్దేవా చేశారు. దాంతో జోక్యం చేసుకున్న లోక్‌సభ స్పీకర్ నేరుగా ప్రశ్న అడగాలని సూచించారు. అందుకు రేవంత్ మధ్యలో అడ్డుపడవద్దని స్పీకర్‌కే సూచించారు. అలా అడ్డుపడవద్దని తనకే చెప్పడాన్ని స్పీకర్ అంగీకరించలేదు. స్పీకర్ పట్ల ఈ తరహా తీరు సరైనది కాదని.. మీ సభ్యులకు మీరైనా వివరించండి అని కాంగ్రెస్ పక్ష నేతకు స్పీకర్ సూచించారు.

ఆ తర్వాత రేవంత్ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధమైన నిర్మలా సీతారామన్.. తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తి బలహీనమైన హిందీలో ప్రశ్న వేశారని.. తాను కూడా వారికి అర్థమయ్యేలా బలహీనమైన హిందీలోనే సమాధానం చెబుతానన్నారు. రూపాయి పతనం విషయంలో అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితులకు ఉన్న మార్పులను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఆ తర్వాత తన హిందీపై నిర్మలా చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. తాను శూద్రకులం నుంచి వచ్చానని కాబట్టి తన హిందీ బలహీనంగానే ఉండవచ్చని.. నిర్మలా సీతారామన్ బ్రహ్మణవాది కాబట్టి ఆమె హిందీ అద్బుతంగా ఉండవచ్చని.. అంత మాత్రాన ఇతరుల భాషను ఎద్దేవా చేయవద్దని రేవంత్ కోరారు.

రేవంత్ కులాలను ప్రస్తావించడంపైనా స్పీకర్ అభ్యంతరం తెలిపారు. ఈ సభకు ప్రతినిధులు కులం, ప్రాంతం ఆధారంగా రాలేదని ప్రజలు ఎన్నుకుంటే వచ్చారన్న విషయం గుర్తించుకోవాలన్నారు. మరోసారి ఇలా కులాల గురించి సభలో ప్రస్తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ హెచ్చరించారు.

First Published:  12 Dec 2022 2:20 PM GMT
Next Story