Telugu Global
National

కాంగ్రెస్ కంప్యూటర్లు, ట్విట్టర్‌కే పరిమితం.. ఆజాద్ ఎదురుదాడి..

కాంగ్రెస్ పార్టీ మ‌న‌ రక్తంతో తయారైందని.. కంప్యూటర్లు, ట్విట్టర్లతో కాదని గులాం నబీ ఆజాద్ అన్నారు. జమ్మూ జిల్లాలో తన మద్దతుదారులతో కలసి ఆయ‌న‌ భారీ ర్యాలీ నిర్వహించారు.

కాంగ్రెస్ కంప్యూటర్లు, ట్విట్టర్‌కే పరిమితం.. ఆజాద్ ఎదురుదాడి..
X

కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన తర్వాత మాతృసంస్థపై రోజురోజుకీ ఆజాద్ స్వరంలో మార్పు స్పష్టమవుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు గులాం నబీ ఆజాద్. జమ్మూ జిల్లాలో తన మద్దతుదారులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారాయన. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా ఆయన ఇలా ర్యాలీ చేపట్టారు. ఆయన వెంట 20 వేల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ కి చెందిన దాదాపు 40 మంది కాంగ్రెస్ నేతలు పార్టీకి రాజీనామా చేసి ఆజాద్ వెంట నడుస్తున్నారు. వీరిలో పలువురు మాజీ మంత్రులు ఉన్నారు.

మా రక్తంతో తయారైంది..

కాంగ్రెస్ పార్టీ మ‌న‌ రక్తంతో తయారైందని.. కంప్యూటర్లు, ట్విట్టర్లతో కాదని అన్నారు ఆజాద్. కాంగ్రెస్ నేతలు మ‌న‌ పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని.. కానీ వారి పరిధి కంప్యూటర్లు, ట్విట్టర్‌కే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదని కేవలం ట్విట్టర్‌లోనే కనిపిస్తోందన్నారు. నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఎదగలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు అరెస్ట్ అయితే.. బస్సుల్లో జైళ్లకు వెళ్లి, తమ పేర్లను డీజీపీ, పోలీస్ కమిషనర్లకు రాసిచ్చి గంటల వ్యవధిలోనే విడుదల అవుతున్నారని, పోరాటాలు చేయడం వారికి చేతకావడంలేదని అన్నారు.

కొత్త పార్టీపై ఏమన్నారంటే..?

ఆజాద్ కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధమయ్యారనే విషయం తేలిపోయింది. అయితే దాని పేరు ఇంకా నిర్ణయించలేదు. జమ్మూ కాశ్మీర్ ప్రజలే తన పార్టీ జెండాను, ఎజెండాను నిర్ణయిస్తారని అంటున్నారు ఆజాద్. అందరికీ అర్థమయ్యేలా తమ పార్టీకి హిందూస్తానీ పేరు పెడతామని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌కు పూర్తిస్థాయిలో రాష్ట్ర హోదా సాధించడం కోసం తమ పార్టీ పోరాడుతుందన్నారు. కాశ్మీర్ భూమిపై హక్కు, స్థానికులకు నివాసాలు, ఉపాధి కల్పించడంపై తాము దృష్టి సారిస్తామని చెప్పారు.

First Published:  4 Sep 2022 12:02 PM GMT
Next Story