Telugu Global
National

100 మంది మోడీలు, అమిత్ షాలు వచ్చినా...ఈ సారి కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్షాలదే విజయం -ఖర్గే

100 మంది మోడీలు, అమిత్ షాలు వచ్చినా...ఈ సారి కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్షాలదే విజయం -ఖర్గే
X

2024 జాతీయ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించే ప్రతిపక్ష సంకీర్ణానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందని, అందుకోసం అన్ని పార్టీలతో చర్చలు జరుపుతోందని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.

"ప్రధాని నరేంద్రమోడీ అనేక సార్లు, 'దేశాన్ని నడిపించ‌గల ఏకైక వ్యక్తిని నేను. ఇతర వ్యక్తులు ఎవరూ నన్ను తాకలేరు' అని అన్నారు. ప్రజాస్వామ్యవాది ఎవరూ ఇలా అనరు, మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, మీరునియంత కాదని గుర్తుంచుకోవాలి, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలే మీకు గుణపాఠం చెబుతారు.'' అని నాగాలాండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే అన్నారు.

2024లో కేంద్రంలో కూటమి ప్రభుత్వం వస్తుందని, దానికి కాంగ్రెస్‌ నాయకత్వం వహిస్తుందని, ఈ విషయంపై ఇతర పార్టీలతో మాట్లాడుతున్నాం, లేకపోతే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం నాశనమై పోతుందని ఖర్గే అన్నారు.

“అందుకే ప్రతి పార్టీతో మాట్లాడుతున్నాం, అభిప్రాయాలు పంచుకుంటున్నాం.. బీజేపీకి మెజారిటీ రాదు.. మిగతా పార్టీలన్నీ కలిసి మెజారిటీ సాధిస్తాం.. 100 మంది మోడీలు లేదా షాలు.. రండి’’ అని ప్రధానికి, హోంమంత్రికి సవాల్ విసిరారు.

స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ నాయ‌కులు ప్రాణాలర్పించారు.. .. మీరు కాదు.. బీజేపీ వాళ్లు.. చెప్పండి.. ఏ బీజేపీ నాయకుడైనా స్వాతంత్య్రం కోసం ప్రాణాలిచ్చారా? లేదా స్వాతంత్య్రం కోసం పోరాడారా? జైలుకు వెళ్లారా? బదులుగా స్వాతంత్య్రం తెచ్చిన మహాత్మా గాంధీని చంపారు. మరి అలాంటి వాళ్ళు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు?" అని ఖర్గే విమర్శించారు.

"దేశ సమైక్యత కోసం ఇందిరాగాంధీ తన ప్రాణాలను అర్పించారు. దేశ సమైక్యత కోసం రాజీవ్ గాంధీ ప్రాణాలర్పించారు. తమకు 2014లోనే స్వాతంత్య్రం వచ్చిందని వారు అనుకుంటున్నారు. వారికి 1947 గుర్తులేదు" అని ఖర్గే అన్నారు.

First Published:  22 Feb 2023 10:53 AM GMT
Next Story