Telugu Global
National

అశోక్ గెహ్లాట్‌కి రాహుల్ ఝలక్.. 'ఒక వ్యక్తి ఒకే పోస్టు'కు కట్టుబడి ఉన్నామని ప్రకటన

కాంగ్రెస్ పార్టీ ఇవ్వాళ‌ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యం అయ్యింది. అశోక్ గెహ్లాట్, శశిథరూర్‌తో పాటు కొత్తగా మనీశ్ తివారి పేరు కూడా వినిపిస్తోంది.

అశోక్ గెహ్లాట్‌కి రాహుల్ ఝలక్.. ఒక వ్యక్తి ఒకే పోస్టుకు కట్టుబడి ఉన్నామని ప్రకటన
X

కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవితో పాటు రాజస్థాన్ సీఎం పోస్టును కూడా ఒకేసారి నిర్వహిస్తానని అశోక్ గెహ్లాట్ ఒక రోజు గడవక ముందే ఆయనకు రాహుల్ గాంధీ ఝలక్ ఇచ్చారు. ఉదయ్‌పూర్ చింతన్ శిబిర్‌లో తీర్మానించిన 'ఒక వ్యక్తి ఒకే పోస్టు'కు కట్టుబడి ఉన్నామని రాహుల్ ఉద్ఘాటించారు. కేరళలో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్.. గురువారం కోచిలో విలేకరులతో మాట్లాడారు. జోడు పదవులపై పార్టీ ఇప్పటికే ఒక స్టాండ్ తీసుకుందని, తీర్మానించిన దాన్ని ఉల్లంఘించే అధికారం పార్టీలో ఎవరికీ లేదని చెప్పారు. అయితే, రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసే సమయానికి అశోక్ గెహ్లాట్ కేరళలోనే ఉన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్య‌తలు స్వీకరించాలని ఆయన రాహుల్‌ను చివరిసారి కోరడానికి వచ్చినట్లు చెప్పారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ ఇవ్వాళ‌ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యం అయ్యింది. అశోక్ గెహ్లాట్, శశిథరూర్‌తో పాటు కొత్తగా మనీశ్ తివారి పేరు కూడా వినిపిస్తోంది. దిగ్విజయ్ సింగ్ కూడా పదవికి నామినేషన్ వేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే గాంధీ కుటుంబానికి ఆప్తుడైన అశోక్ గెహ్లాట్‌నే పదవి వరించే అవకాశం ఉంది. కానీ, తాజాగా రాహుల్ చేసిన ప్రకటనతో గెహ్లాట్ ఏ నిర్ణయం తీసుకుంటారా అని కాంగ్రెస్ వర్గాలు వేచి చూస్తున్నాయి.

ఇవ్వాళ ఉదయం తొలిదశ పాదయాత్ర పూర్తి చేసిన తర్వాత రాహుల్ గాంధీ పలు విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరు అధ్యక్షుడు అయిన ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇదొక చరిత్రాత్మకమైన పదవి. మన దేశం పట్ల కమిట్మెంట్ కలిగి వ్యక్తులు నిర్వహించిన పదవని ఆయన చెప్పారు. ఇదొక సంస్థకు సంబంధించిన పోస్టు మాత్రమే కాదని.. ఎంతో మంది నమ్మకాలను వమ్ము చేయకుండా ఓ సిద్ధాంతం ప్రకారం ముందుకు నడిపించాల్సిన పదవని ఆయన సూచించారు. పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా దేశం కోసం పని చేయాల్సి ఉంటుంది. కొన్ని ఐడియాలజీలను పాటించాల్సి ఉంటుందని చెప్పారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారా? అన్న ప్రశ్నకు మాత్రం రాహుల్ గాంధీ సూటిగా సమాధానం ఇవ్వలేదు. నేను అభ్యర్థినా? కాదా? అనే విషయాన్ని వదిలేయండి. ప్రస్తుతం తాను ఇతర విషయాల కంటే భారత్ జోడో యాత్రపైనే దృష్టి పెట్టానన్నారు. భారత్ జోడో యాత్ర ప్రారంభంలోనే గోవాలో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై స్పందించారు. ప్రస్తుతం మేము ఓ యంత్రంతో పోరాడుతున్నాము. ఈ దేశంలోని అన్ని సంస్థలను నిర్వీర్యం చేస్తూ.. డబ్బు, అధికారం ఉందనే అహంతో ప్రజలను ఇబ్బందులు పెడుతోంది. అదే డబ్బుతో ఎంతో మందిని కొనేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని బీజేపీని విమర్శించారు.

భారత్ జోడో యాత్ర దేశంలోని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశం వరకు కొనసాగుతోంది. అదే మా వ్యూహం. అంతే కానీ దేశంలోని రాష్ట్రాలన్నింటినీ కవర్ చేయాలని అనుకోలేదు. అలా చేయాలంటే 10వేల కిలోమీటర్లకు పైగా నడవాల్సి ఉంటుంది. బీహార్, పశ్చిమ బెంగాల్, గుజరాత్ వంటి రాష్ట్రాలకు ఎందుకు వెళ్లడం లేదని అడుగుతున్నారు. మేం చేస్తున్నామో మాకు పూర్తి అవగాహన ఉంది. ప్రతీ ప్రాంతానికి నడవాలని మేం లక్ష్యంగా పెట్టుకోలేదని రాహుల్ చెప్పుకొచ్చారు.

First Published:  22 Sep 2022 11:57 AM GMT
Next Story