Telugu Global
National

సీఎం అభ్యర్థి లేక మోడీ వెతుకులాట.. ప్రియాంక విమర్శలు

బీజేపీ ఎప్పటిలాగే మతాన్ని ఉపయోగించుకొని ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సీఎం అభ్యర్థి లేక మోడీ వెతుకులాట.. ప్రియాంక విమర్శలు
X

రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీకి కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా లేరని.. మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం వెతుక్కుంటున్నట్లు ఉందని కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో ఈనెల 25వ తేదీన ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దుంగ్రాపుర్ జిల్లాలోని సగ్వాడాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజస్థాన్‌లో బీజేపీ చల్లాచదురైందన్నారు. ఆ పార్టీకి కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా లేరని ఎద్దేవా చేశారు. దీంతో ప్రచార బాధ్యతలను ప్రధానమంత్రి మోడీ తీసుకొని రాష్ట్రం నలుమూలలా పర్యటిస్తున్నారని తెలిపారు. ఆయన తీరు చూస్తుంటే కొన్నిసార్లు ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం వెతుక్కుంటున్నట్లు కనబడుతోందని వ్యాఖ్యానించారు.

బీజేపీ ఎప్పటిలాగే మతాన్ని ఉపయోగించుకొని ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ పాలనలో విఫలమైందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడంతో పాటు రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

కాగా, రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచార బాధ్యతలను పూర్తిగా ప్రియాంక గాంధీ తనపై వేసుకున్నారు. ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రాహుల్ గాంధీ ఒకే ఒక్కసారి అక్కడ పర్యటించారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో నెలకొన్న విభేదాల కారణంగానే రాహుల్ గాంధీ రాజస్థాన్‌లో పర్యటించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ రాజస్థాన్‌లో సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు.

First Published:  17 Nov 2023 1:59 PM GMT
Next Story