Telugu Global
National

భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమానికి 21 పార్టీల నేతలను ఆహ్వానించిన కాంగ్రెస్

''యాత్ర ప్రారంభం నుండి, మేము ప్రతీ భారతీయుడిని ఈ యాత్రలో భాగస్వామ్యం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. జనవరి 30వ తేదీ మధ్యాహ్నం శ్రీనగర్‌లో జరగనున్న భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను'' అని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు

భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమానికి 21 పార్టీల నేతలను ఆహ్వానించిన కాంగ్రెస్
X

జనవరి 30న శ్రీనగర్‌లో జరిగే భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ 21 రాజకీయ పార్టీల అధినేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖలు రాశారు.

“యాత్ర ప్రారంభం నుండి, మేము ప్రతీ భారతీయుడిని ఈ యాత్రలో భాగస్వామ్యం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. రాహుల్ గాంధీ ఆహ్వానం మేరకు పలు రాజకీయ పార్టీల ఎంపీలు కూడా యాత్రలో వివిధ దశల్లో పాల్గొన్నారు. జనవరి 30వ తేదీ మధ్యాహ్నం శ్రీనగర్‌లో జరగనున్న భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ద్వేషం, హింస సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటంలో ఈ రోజున ప్రాణాలు కోల్పోయిన మహాత్మా గాంధీ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నాం. ”అని ఖర్గే రాశారు.

భారతదేశం ప్రస్తుతం ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు. ‘‘పార్లమెంటులోనూ, మీడియాలోనూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న ఈ సమయంలో యాత్ర లక్షలాది మందితో నేరుగా కనెక్ట్ అయ్యింది. మన దేశాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన సమస్యలైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సామాజిక విభజనలు, ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపర్చడం, మన సరిహద్దుల్లో ముప్పు వంటి సమస్యలపై మేము చర్చించాము. ఈ యాత్రలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొని తమ సమస్యలను పంచుకున్నారు. యువత, మహిళలు, వృద్ధులు, రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, దళితులు, ఆదివాసీలు, భాషా, మతపరమైన మైనారిటీలు, ఆక్టివిస్టులు, కళాకారులు, ఆధ్యాత్మిక నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ ఈ యాత్ర ప్రధాన విజయం.'' అని ఖర్గే అన్నారు.

యాత్రలో సామరస్యం, సమానత్వం సందేశం ఉందని ఖర్గే అన్నారు. “భారతీయులు శతాబ్దాలుగా ఈ విలువల కోసం పోరాడారు. అవి మన రాజ్యాంగంలో పొందుపర్చిఉన్నాయి. పాద యాత్రలో యాత్రికులు ప్రతిరోజూ 20-25 కిలోమీటర్లు వేడి, చలి, వర్షంలో నడిచారు. వారు యాత్ర సందేశాన్ని లక్షలాది మందికి చేరవేశారు’’ అని ఖర్గే అన్నారు.

"ద్వేషం, హింసకు వ్యతిరేకంగా పోరాడటానికి, సత్యం, కరుణ, అహింస సందేశాన్ని వ్యాప్తి చేయడానికి, అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, న్యాయం తదితర‌ రాజ్యాంగ విలువలను రక్షించడానికి మేము కట్టుబడి ఉంటాము" అని ఆయన అన్నారు.

“మన దేశానికి ఈ సంక్షోభ సమయంలో ఈ యాత్ర ఒక శక్తివంతమైన గొంతుగా ఉద్భవించింది. మీరు పాల్గొని దాని సందేశాన్ని మరింత బలపరుస్తారని ఆశిస్తున్నాను.'' అని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు.

First Published:  12 Jan 2023 2:32 AM GMT
Next Story