Telugu Global
National

కర్నాటక కాంగ్రెస్ ని కలవరపెడుతున్న మరో హామీ

నెలకి 5 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తామని ఎన్నికల వేళ ఘనమైన హామీ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. కానీ ఇప్పుడు ఆ హామీ అమలుకోసం దిక్కులు చూస్తున్నారు.

కర్నాటక కాంగ్రెస్ ని కలవరపెడుతున్న మరో హామీ
X

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ, అలవికాని హామీల అమలులో మాత్రం కాస్త తడబడుతోంది. ఉచిత కరెంటు కోసం గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయి. కరెంటు బిల్లులు కట్టేది లేదని సిబ్బందికి తెగేసి చెబుతున్నారు ప్రజలు. ఇక ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం గురించి తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా మహిళలు బస్సెక్కేస్తున్నారు. పురుషులకు అవసరమున్నా సీట్లు కరువయ్యాయి, కండక్టర్లు సర్కస్ చేయాల్సి వస్తోంది, ఆర్టీసీ నష్టాల్లోకి జారుకుంది. ఈ సమస్యకు పరిష్కారమేంటనేది తేలడంలేదు. ఇప్పుడు కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త సమస్య వచ్చిపడింది. ఉచిత బియ్యం పంపిణీకోసం సిద్ధరామయ్య సర్కారు అవస్థలు పడుతోంది.

ఎన్నికల వేళ ప్రతి కుటుంబానికి 5 కేజీల ఉచిత బియ్యం ఇస్తామని మాటిచ్చింది కర్నాటక ప్రభుత్వం. అయితే ఆ రాష్ట్రం దగ్గర తగినంత ధాన్యం నిల్వలు లేవు. అటు కేంద్రం కూడా చేయిచ్చింది. తమ దగ్గర బియ్యం నిల్వలు లేవని తేల్చేసింది. అసలే రాష్ట్ర ప్రజలు ఓడించారనే కోపంతో రగిలిపోతోంది బీజేపీ. ఎలాగైనా కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు బియ్యం లేవని తేల్చి చెప్పింది. దీంతో కర్నాటక ప్రభుత్వం మధ్యే మార్గాన్ని ఆశ్రయించింది. బియ్యం ఇవ్వలేం, దాని బదులు డబ్బులిస్తామంటోంది. అయితే 170 రూపాయల ఆర్థిక సాయం ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇదే అదనుగా బీజేపీ కూడా ఎదురుదాడికి దిగింది. హామీలు అమలు చేయలేని కాంగ్రెస్, పాలన ఎలా చేస్తుందని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు.

కిం కర్తవ్యం..?

నెలకి 5 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తామని ఎన్నికల వేళ ఘనమైన హామీ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. కానీ ఇప్పుడు ఆ హామీ అమలుకోసం దిక్కులు చూస్తున్నారు. కేంద్రం సహకరించడంలేదని చెప్పినా రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. దీంతో ఇప్పుడు తెలంగాణవైపు చూస్తోంది కర్నాటక ప్రభుత్వం. తెలంగాణ మిగులు నిల్వలను సేకరించాలనుకుంటోంది.

First Published:  29 Jun 2023 2:17 AM GMT
Next Story