Telugu Global
National

బేటీ బచావో(బీజేపీ సే)

అప్పట్లో ఒలింపిక్ పతక విజేతగా ఆమెను స్టేజ్ పై ప్రశంసించిన బీజేపీ సర్కారు, ఇప్పుడు అదే సాక్షిని నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీసులు తీసుకెళ్లే స్థితికి చేర్చిందంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

బేటీ బచావో(బీజేపీ సే)
X

బేటీ బచావో, బేటీ పఢావో.. గతంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కార్యక్రమం ఇది. దేశంలోని ఆడపిల్లల్ని కాపాడండి, వారిని చదివించండి అనే నినాదంతో హడావిడి చేశారు బీజేపీ నేతలు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో సత్తా చాటిన ఆడపిల్లలను ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేశారు కూడా. అలా హర్యానా నుంచి బేటీ బచావో కార్యక్రమానికి రెజ్లర్ సాక్షి మలిక్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. రియో ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేతగా నిలిచిన సాక్షి మలిక్ ని అప్పట్లో బీజేపీ నెత్తిన పెట్టుకుంది. హర్యానా బ్రాండ్ అంబాసిడర్ గా ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది.

2016 ముచ్చట అది. కట్ చేస్తే ఇప్పుడు అదే సాక్షి మలిక్ ని ఢిల్లీ రోడ్లపై ఈడ్చి పక్కన పడేశారు పోలీసులు. అప్పట్లో బేటీ బచావో పథకానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సాక్షి మలిక్ ఇప్పుడు నిజంగానే బేటీ బచావో అని అరవాల్సిన పరిస్థితి. అవును, బేటీ బచావో (బీజేపీ సే)అంటూ కాంగ్రెస్ కాస్త గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది. అప్పట్లో ఒలింపిక్ పతక విజేతగా ఆమెను స్టేజ్ పై ప్రశంసించిన బీజేపీ సర్కారు, ఇప్పుడు అదే సాక్షిని నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీసులు తీసుకెళ్లే స్థితికి చేర్చిందంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 2016 - 2023కి ఎంత మార్పు వచ్చిందనే విషయాన్ని ట్విట్టర్లో తెలిపింది.


బీజేపీకి భారీ డ్యామేజీ..

ఓవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పై ఆ పార్టీ చర్యలు తీసుకోకపోగా, బాధితులైన రెజ్లర్లను అరెస్ట్ ల పేరుతో వేధించడం, వారి నిరసనను అణచివేయాలనుకోవడం మాత్రం దారుణం అంటున్నారు వివిధ పార్టీల నేతలు. నూతన పార్లమెంట్ ప్రారంభం రోజు ఢిల్లీలో జరిగిన ఈ ఘటనతో దేశం మొత్తం నివ్వెరపోయింది. భారత దేశ ప్రతిష్టను ప్రపంచ వేదికపై చాటి చెప్పిన క్రీడాకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన బీజేపీకి భారీ డ్యామేజీ చేస్తుందనే వార్తలు వినపడుతున్నాయి.

First Published:  29 May 2023 4:34 PM GMT
Next Story