Telugu Global
National

ఢిల్లీ పీఠమే టార్గెట్‌.. కాంగ్రెస్‌ భారీ స్కెచ్‌..!

మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌ పార్టీ యూపీలోని దళితుల ఓట్లపై పట్టు కోల్పోతున్న వేళ.. ఆ ఖాళీని పూరించేందుకు ఇదే సమయమని కాంగ్రెస్ భావిస్తోంది.

ఢిల్లీ పీఠమే టార్గెట్‌.. కాంగ్రెస్‌ భారీ స్కెచ్‌..!
X

ఢిల్లీ పీఠం దక్కించుకోవాలంటే యూపీ దగ్గర దారి. ఈ విషయం రాజకీయ పార్టీలకు బాగా తెలుసు. ఈ నేపథ్యంలోనే యూపీలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. పార్టీలోని కొంత మంది ప్రముఖులను యూపీ నుంచి పోటీ చేయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా యూపీలోని దళిత ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు పార్టీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గేను యూపీలోని ఓ రిజర్వ్‌డ్‌ స్థానం పోటీ చేయించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌ పార్టీ యూపీలోని దళితుల ఓట్లపై పట్టు కోల్పోతున్న వేళ.. ఆ ఖాళీని పూరించేందుకు ఇదే సమయమని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగానే ఖర్గేను బారాబంకి లేదా ఇటావా నుంచి పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌, ఎస్పీ `ఇండియా` కూటమిలో భాగంగా ఉన్నాయి. ఖర్గే ఇటావా నుంచి బరిలో దిగితే ఎస్పీ అభ్యర్థులకు సైతం మేలు జరిగే అవకాశాలున్నాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఖర్గే కర్ణాటకలోని తన సొంత స్థానంతో పాటు యూపీలోని ఓ స్థానం నుంచి పోటీ చేయిస్తారని సమాచారం.

ఇక ఖర్గేతో పాటు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా యూపీ నుంచే పోటీ చేయనున్నారు. ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్‌ గాంధీ తన సొంత స్థానం అమేథి నుంచి బరిలో దిగనున్నారు. ఇక పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ప్రయాగ్‌ రాజ్‌, ఫుల్పూర్‌ లేదా వారణాసి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఒకవేళ అనారోగ్య కారణాలతో ఈసారి సోనియాగాంధీ పోటీ నుంచి తప్పుకుంటే ప్రియాంక రాయ్‌బరేలి నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

ఒకవేళ చివర్లో బీఎస్పీ ఇండియా కూటమిలో చేరినప్పటికీ తమ ప్లాన్‌లో ఎలాంటి మార్పు ఉండదంటున్నారు యూపీ కాంగ్రెస్ నేతలు. బీఎస్పీ ఇండియా కూటమిలో చేరాలని యూపీ కాంగ్రెస్‌ నేతలు ఆహ్వానిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్లాన్ ఏ మేర సక్సెస్‌ అవుద్దో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

*

First Published:  12 Sep 2023 10:00 AM GMT
Next Story